3 రాష్ట్రాల్లో కమల వికాసం
దేశంలో జరిగిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో బీజేపీ విజయభేరీ మోగించింది. మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 164 స్థానాల్లో విజయం సాధించింది. అదే సమయంలో రాజస్థాన్ తన చరిత్రను పునరావృతం చేసి, అధికారాన్ని మార్చుకుంది. ఇక్కడ బీజేపీ 115 స్థానాల్లో విజయం సాధించింది. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో కూడా బీజేపీ స్పష్టమైన మెజారిటీ అంటే 90 సీట్లలో 54 గెలుచుకుంది. ఈ మూడు రాష్ట్రాలు లోక్‌సభ ఎన్నికలకు కీలకమైనవి. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లో 65 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2024 ఎన్నికలకు ఈ రాష్ట్రాలు చాలా కీలకమైనవి. ఈ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించాక 17 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వీటిలో కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉండగా కొన్నింటిలో మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉంది.
ఈ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేజిక్ మరోసారి పనిచేసింది. ఆయా రాష్ట్రాల్లో ప్రజాదరణ కలిగిన నేతలు లేకపోవడంతో మోదీ పోస్టర్‌తోనే బీజేపీ ఎన్నికల యుద్దానికి వెళ్లింది. మోదీకి ప్రజాదరణ ఇప్పటికే క్షేత్రస్థాయిలో చెక్కుచెదరకుండా ఉంది. కీలక నియోజకవర్గాల్లో ప్రత్యర్థి కాంగ్రెస్ ను ఓడించడంలో మోదీ హవా పనిచేసినట్లు కనిపిస్తోంది. మధ్యప్రదేశ్ లో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ట్రెండ్లు వెల్లువెత్తిన కొద్ది నిమిషాలకే, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ విజయాన్ని మోదీకి ఆపాదించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించిన సంక్షేమ పథకాలు పార్టీని, ముఖ్యంగా మహిళా ఓటర్లలో ఆదరణ పొందడంతో కీలక పాత్ర పోషించాయని అంగీకరించినప్పటికీ, మోదీ, అమిత్ షా, నడ్డా వ్యూహాలే తమను అధికారానికి తీసుకొచ్చాయని తెలిపారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం, గోవా రాష్ట్రాల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ ప్రభుత్వం ఉంది. కాగా మహారాష్ట్ర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, పుదుచ్చేరిలలో మిత్రపక్షాలతో చేయికలిపింది.
ప్రస్తుతం దేశంలోని 57 శాతానికి పైగా ప్రాంతంలో బీజేపీ అధికారంలో ఉంది. 2017 సంవత్సరంలో దేశంలోని 78 శాతం ప్రాంతంలో బీజేపీ అధికారంలో ఉంది. 2018లో బీజేపీ పలు ఓటములను ఎదుర్కొంది. మొదట కర్ణాటకలో, ఆ తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారాన్ని కోల్పోయింది. 2019 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో తన సత్తాను చాటుకుంది. అయితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాల పరంపర కొనసాగింది. 2019 నాటికి బీజేపీ 34శాతం రాజకీయ విస్తీర్ణానికి తగ్గింది. బీజేపీ పాలన కేవలం 44 శాతం జనాభాపై మాత్రమే ఉంది. అయితే ఈ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో భారీ విజయం సాధించడంతో పార్టీ గ్రాఫ్ మరింతగా పెరిగింది. ఈ విజయాలను మోదీ మ్యాజిక్ అని అంటున్నారు. ఏదీ ఏమైనా రాబోయే లోక్ సభ ఎన్నికలకు సెమిఫైనల్‌గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో మోదీ ఆధ్వర్యంలో బిజెపి తన సత్తాను చాటడంతో లోక్ సభ ఎన్నికల్లో కూడా బిజెపి విజయకేతనం ఎగురవేయడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఢల్లీిలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించిన విజయోత్సవ సభకు ప్రధాని నరేంద్ర మోదీ సహా పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. మూడు రాష్ట్రాల గెలుపు గ్యారంటీతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి అన్ని కులాలు, ప్రాంతాలు, వర్గాల ప్రజలు ఓటేశారని మోడీ తెలిపారు. దేశంలోని యువత అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారని, వారి ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసినవారిని తరిమికొట్టారన్నారు ప్రధాని మోడీ. మహిళలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ 100 శాతం నెరవేరుస్తామని ప్రధాని మోడీ భరోసా ఇచ్చారు. తెలంగాణతో తమ బంధం విడదీయరానిదని వెల్లడించారు. బీజేపీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.













