భారత వైద్యవిద్యకు గ్లోబల్ గుర్తింపు..
భారత వైద్య చరిత్రలో అపూర్వఘట్టం. భారత వైద్య విద్యకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది.ఇప్పుడు భారత వైద్య విద్యార్థులు.. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో ట్రైనింగ్, ప్రాక్టీస్ చేసే సువర్ణావకాశాన్ని పొందారు. నేషనల్ మెడికల్ కమిషన్కు పదేళ్ల పాటు గుర్తింపు హోదాను మంజూరు చేసింది వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ సంస్థ.
కొత్త గుర్తింపు కారణంగా, ప్రస్తుతం దేశంలోని 706 మెడికల్ కాలేజీలు .. WFME గుర్తింపు పొందుతాయి. అంతేకాదు.. రాబోయే 10 సంవత్సరాలలో ఏర్పాటు చేయబోయే కొత్త మెడికల్ కాలేజీలు స్వయంచాలకంగా WFME గుర్తింపు పొందుతాయి.కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. ఈ అక్రిడిటేషన్ “భారతీయ వైద్య పాఠశాలలు మరియు నిపుణుల అంతర్జాతీయ గుర్తింపు మరియు ఖ్యాతిని పెంచుతుంది, విద్యాపరమైన సహకారాలు మరియు మార్పిడిని సులభతరం చేస్తుంది మరియు వైద్య విద్యలో నిరంతర అభివృద్ధి మరియు ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది మరియు వైద్యంలో నాణ్యతా భరోసా సంస్కృతిని ప్రోత్సహిస్తుంది.
ఈ గుర్తింపు వల్ల మరో ముఖ్యమైన లాభం ఏమిటంటే.. భారత్, అంతర్జాతీయ దేశాల విద్యార్థులకు వైద్య విద్యపరంగా చక్కని మజిలీ కానుంది. దీంతో అత్యంత చౌకగా అంతర్జాతీయ వైద్యవిద్యను అభ్యసించే అవకాశం దక్కుతుంది. ముఖ్యంగా అమెరికా, కెనడా సహా పలుదేశాల్లో శిక్షణ, అభ్యాసానికి అవకాశం ఉండడంతో.. ఇతర దేశాల అభ్యర్థులు ఇప్పుడు భారత్ వైపు చూడనున్నారు.
గతంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమయంలో భారతీయ వైద్యవిద్యార్థుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఎంసీఐ అవినీతిమయం కావడం, ప్రమాణాలు నాసిరకంగా మారడంతో.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కలేదు. ఫలితంగా లక్షల సంఖ్యలో భారత విద్యార్థులు ఏటా విదేశాల్లో వైద్యవిద్య అభ్యసిస్తూ వచ్చారు. దీంతో ఇతర దేశాలకు.. మన విద్యార్థుల వల్ల ఆర్థికలబ్థి చేకూరేది. దానికి తోడు ఇక్కడ వైద్యవిద్య అభ్యసించిన విద్యార్థులు.. విదేశాల్లో ప్రాక్టీస్ చేయాలంటే , ఆదేశం నిర్వహించే అర్హత పరీక్షలో విజయం సాధించాల్సి వచ్చేది. దీంతో భారత విద్యార్థులకు ఓరకంగా చెప్పాలంటే ఇబ్బందికరంగా పరిణమించింది. తాజాగా WFME గ గుర్తింపుతో ఆకష్టాలకు తెరపడినట్లే అని భావించవచ్చు.













