భారతీయ అమెరికన్ల ఓట్లే కీలకం… ప్రత్యేక కార్యాచరణలో ట్రంప్, హారిస్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు తీవ్ర ప్రభావం చూపనున్నారు. అమెరికాకు వలస వచ్చిన వారిలో మెక్సికన్ల తర్వాత భారతీయులదే రెండో స్థానం. ఈ ఏడాది ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల ఓట్లు కీలకంగా మారాయి. సంఖ్య పరంగా చూస్తే ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, నానాటికీ భారతీయ అమెరికన్ల ప్రభావం పెరుగుతుండడం వల్ల వారిని విస్మరించే పరిస్థితి లేదు. అందుకే రెండు ప్రధాన పార్టీలు వీరి ఓట్లను దక్కించుకునేందుకు ప్రత్యేక ప్రణాళికలు వేస్తున్నాయి.
నిర్ణాయక శక్తిగా భారతీయ అమెరికన్లు
అమెరికాలో నవంబర్ 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల ఓట్లు కీలకంగా మారాయి. అక్కడి దేశ రాజకీయాల్లో భారతీయ మూలాలు ఉన్నవారు కీలక పాత్ర పోషిస్తున్నారు. కేవలం ఓటర్లుగానే కాకుండా రాజకీయ నేతలుగా, అభ్యర్థులుగా, ఓటర్లను సమీకరించే శక్తిగా, నిధుల సేకరించే వారిగా ఇలా అనేక అంశాల్లో భారతీయులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అమెరికా మెుత్తం ఓటర్లలో భారతీయ అమెరికన్ల ఓట్లు దాదాపు 21 లక్షలు ఉంటాయి. సంఖ్యా పరంగా చూస్తే తక్కువే అయినా వీరి ప్రభావం నానాటికీ పెరుగుతుండడంతో పార్టీలకు…వీరిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అందుకే రెండు ప్రధాన పార్టీలైన డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు భారతీయ అమెరికన్లను విస్మరించే పరిస్థితి లేదు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ కూడా భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి .
స్వింగ్ రాష్ట్రాల్లో పరిస్థితి ?
అధ్యక్ష ఎన్నికను మలుపు తిప్పగల సామర్థ్యమున్న స్వింగ్ రాష్ట్రాల్లో భారతీయుల జనాభా ఎక్కువగా ఉంది. స్వింగ్ స్టేట్స్‌గా పిలిచే పెన్సిల్వేనియా, ఆరిజోనా, నెవాడా, జార్జియా, మిషిగన్, నార్త్ కరోలినా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఉన్న దక్షిణాసియా ఓటర్లలో ఇండియన్లు అత్యధికంగా ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తేల్చడంలో అత్యంత కీలకమైన పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బక్స్ కౌంటీలో భారతీయులు అధిక సంఖ్యలో ఉన్నారు. మిషిగన్, జార్జియా రాష్ట్రాల్లోనూ భారతీయ సంతతి అధికంగా ఉంది. దీంతో వీరి ఓట్లు, మద్దతు రెండు పార్టీలకూ కీలకంగా మారనుంది.
సర్వేలు ఏం చెబుతున్నాయి?
స్వింగ్ రాష్ట్రాల్లో హారిస్, ట్రంప్ విజయావకాశాలపై ఇండియన్ ఓటర్లు ప్రభావితం చేసే అవకాశం ఉందని సర్వేలు అంటున్నాయి. అమెరికాలో దక్షిణాసియాకు చెందిన 48 లక్షల మందిపైగా యువ ఓటర్లను ప్రభావితం చేయడంలో భారతీయులు కీలకంగా మారినట్లు వెల్లడించాయి. గత రెండు అధ్యక్ష ఎన్నికల్లోనూ భారతీయ అమెరికన్లు భారీ సంఖ్యలో ఓటేసినట్లు ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. 2020 ఎన్నికల్లో 71 శాతం ఇండో అమెరిన్లు ఓటేసినట్లు చెప్పాయి. ఈ సారి 91 శాతం మంది ఓటు వేసే అవకాశాలు ఉన్నాయని ఆసియన్ అమెరికన్ ఓటర్ సర్వే అంచనా వేసింది.
భారీ స్థాయిలో విరాళాలు
అమెరికాలో ప్రధాన పార్టీలకు భారతీయ అమెరికన్ల నుంచి పెద్ద మెుత్తంలో విరాళాలు వెలుతున్నాయి. అక్కడ భారతీయ అమెరికన్ల సగటు వార్షిక ఆదాయం 1.45 లక్షల డాలర్లుగా ఉంది. ఇది అమెరికన్లతో పోలిస్తే 21 శాతం ఎక్కువ. హారిస్‌కు కాలిఫోర్నియాలో ఇటీవల ఒక్క వారంలోనే ఏకంగా 5.5 కోట్ల డాలర్ల విరాళాలు వచ్చాయి. వాటిలో ఎక్కువ మెుత్తంలో భారతీయుల నుంచే వచ్చాయి. డెమోక్రటిక్ పార్టీకి భారీ విరాళాలిచ్చిన జాబితాలో 60 మందికి పైగా ఇండియన్ అమెరికన్లు ఉన్నారు. అక్కడ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న భారతీయుల సంఖ్య పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సెనేట్, ప్రతినిధుల సభతో పాటు రాష్ట్రాల సెనేట్లు, అసెంబ్లీలు, సిటీ కౌన్సిళ్లు, స్కూలు బోర్డులకు ప్రాతినిథ్యం వహిస్తున్న, జిల్లా అటార్నీలుగా నియమితులవుతున్న భారతీయ మూలాల ఉన్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.
యూఎస్ కాంగ్రెస్‌లో ఐదుగురు భారతీయ అమెరికన్లున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇది ఏడుకు పెరుగుతుందని భావిస్తున్నారు. అమెరికా యువజనుల్లో భారతీయులు కేవలం 0.6 శాతమే. కానీ వారిలో 4.4 శాతం మంది ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. బైడెన్ పాలనా యంత్రాంగంలో 150 మందికి పైగా భారతీయ అమెరికన్లు కీలక స్థానాల్లో ఉన్నారు. హారిస్ అధ్యక్షురాలిగా ఎన్నికైతే ఆ సంఖ్య 200కు పెరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.






