భారత్ విధానమిదే..
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో టెల్ అవీవ్ పక్షాన నిలుస్తూ ప్రకటన చేసి, అరబ్ ప్రపంచం నుంచి అనుమానపు దృక్కులను ఎదుర్కొంటున్న భారత్ … దౌత్య చతురతను ప్రదర్శించింది. ఉగ్రవాదం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టిన భారత్.. బాధిత ప్రజలకు అండగా నిలుస్తామని తేల్చి చెప్పింది. హమాస్ ఉగ్రదాడి తదనంతర పరిస్థితుల్లో.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేసిన భారత ప్రధాని మోడీ.. తమ సంఘీభావం ప్రకటించారు. భారత్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దీంతో భారత్ ఇజ్రాయెల్ పక్షాన నిలుస్తోందని, చిరకాల మిత్రదేశం పాలస్తీనాకు దూరం జరుగుతోందని అంతర్జాతీయంగా అభిప్రాయాలు వెలువడ్డాయి. అయితే దీనిపై భారత్ క్లారిటీ ఇచ్చింది
పాలస్తీనా స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందడాన్ని తాము సమర్ధిస్తున్నామని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం పాలస్తీనాపై భారత్ వైఖరిని స్పష్టం చేశారు. ‘‘ఇజ్రాయెల్ – పాలస్తీనా విషయంలో భారత్ వైఖరి చాలా కాలంగా స్థిరంగా ఉంది. ఇజ్రాయెల్‌తో శాంతియుతంగా చర్చలు జరిపి.. గుర్తింపు పొందిన సరిహద్దుల్లో నివసిస్తూ.. సార్వభౌమాధికారం, పూర్తి స్వతంత్రతతో వ్యవహరించే పాలస్తీనా ఏర్పాటును భారత్ ఎల్లప్పుడూ సమర్థిస్తుంది. ఇందుకోసం పాలస్తీనా, ఇజ్రాయెల్‌లు నేరుగా సంప్రదింపులు జరపాలని భారత్ ఆశిస్తోంది’’ అని బాగ్చీ తెలిపారు.
ఇజ్రాయెల్, గాజాలో మానవతా పరిస్థితులపై స్పందిస్తూ.. ఇరు వర్గాలు అంతర్జాతీయ మానవతా చట్టాలను పాటించాలన్నారు బాగ్చీ. అదే సమయంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించకూడదని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో తాను ఇరుదేశాలకు మిత్రదేశంగా ఉంటానని భారత్ స్పష్టం చేసినట్లైంది. చిరకాల మిత్రదేశాలతో తన దోస్తీని కొనసాగిస్తూనే.. ఇజ్రాయెల్ కు బాసటగా ఉంటానని క్లారిటీ ఇచ్చింది. దీంతో అరబ్ ప్రపంచానికి తనపై వస్తున్న అనుమానాలకు భారత్ తెరదించినట్లైంది. అంతేకాదు.. ఇజ్రాయెల్ తాను ఏప్రాతిపదికన మద్దతిస్తున్నానన్న అంశంపైనా అంతర్జాతీయ సమాజానికి చక్కటి జవాబు చెప్పినట్లైందని దౌత్య నిపుణులు చెబుతున్నారు.
ఇజ్రాయెల్‌కు భారత్ ఆయుధపరంగా సాయం అందిస్తోందా? అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు .. ప్రస్తుతం ఆ దేశంలో ఉన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంపైనే దృష్టి సారించినట్లు బాగ్చి తెలిపారు. ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్రం ఆపరేషన్ అజయ్ ను ప్రకటించింది. భారత పౌరులను సురక్షితంగా తీసుకు రావడానికి తగిన చర్యలు చేపడుతోంది.













