Pakistan: ఐక్యరాజ్యసమితిలో మళ్లీ పాక్ పరువు పాయె..!
దాాయాది పాకిస్తాన్ కు ఎన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలినా బుద్ధిరావడం లేదు. పదేపదే అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్నిలేవనెత్తడం.. భారత్ తో తలంటించుకోవడం అలవాటుగా మారింది. ఎప్పటిలాగే ఐక్యరాజ్యసమితిలో బహిరంగంగా చర్చ జరుగుతుండగా.. జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) అంశాన్ని ప్రస్తావించి పాక్ తన కుటిల బుద్ధిని చాటుకుంది. దీనికి భారత్ గట్టిగా బదులిచ్చింది. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను జైలుకి పంపి.. అతడికి విరోధి అయిన ఆసిమ్ మునీర్‌కు సర్వాధికారాలు ఇవ్వడంపై చురకలంటించింది.
దక్షిణాసియాలో పాక్ శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటుందన్నారు పాక్ (Pakistan) ప్రతినిధి ఆసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ .. కానీ, శాంతి ఏకపక్షంగా ఉండకూడదంటూ.. జమ్మూకశ్మీర్ వివాదంపై సమస్య ఇంకా మిగిలిఉందన్నారు. దీనికి న్యాయమైన పరిష్కారం అవసరమన్నారు. సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా నిలిపివేసిందంటూ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలకు యూఎన్‌లో భారత (India) శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ (Parvathaneni Harish) గట్టిగా బదులిచ్చారు.
జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లు భారత్‌లో అంతర్భాగమని పునరుద్ఘాటించారు. భారత్‌కు, దేశంలోని ప్రజలకు ముప్పు తలపెట్టడం పైనే పాక్ దృష్టి ఉంటుందని విమర్శించారు. ‘65 ఏళ్ల క్రితం విశ్వాసం, సంకల్పం, స్నేహస్ఫూర్తితో భారత్ సింధూ జలాల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సమయంలో మాపై పాక్ మూడు యుద్ధాలు, వేలాది ఉగ్రదాడులకు పాల్పడి ఒప్పందాన్ని ఉల్లంఘించింది. గత నాలుగు దశాబ్దాల్లో పాక్ ఉగ్రవాదుల దాడుల వల్ల పదివేల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు’ అని అన్నారు. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్‌లో ఈ ఏడాది జరిగిన పహల్గాం ఉగ్రదాడిని కూడా ప్రస్తావించారు.
పాక్ ఉగ్ర చర్యల కారణంగా భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన విషయాన్ని గుర్తుచేశారు పర్వతనేని హరీశ్. పాక్ ఉగ్రవాదం ఏ రూపంలో వచ్చినా భారత్ దాన్ని శక్తిమంతంగా ఎదుర్కొంటుందన్నారు. దాయాది దేశంలోని ప్రజాస్వామ్యం, రాజకీయ పరిస్థితులపై హరీశ్ విమర్శలు గుప్పించారు. ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను జైలుకి పంపించి.. రక్షణదళాల చీఫ్ ఆసిమ్ మునీర్‌కు సర్వాధికారాలు అప్పగించిన ఘనత ఆ దేశానికే దక్కుతుందని వ్యాఖ్యానించారు.






