మిషన్ ముంబై..
టార్గెట్ -2024 దిశగా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.. బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి పావులు కదుపుతోంది. గురువారం ముంబయి వేదికగా 27 పార్టీలు భేటీ కానున్నాయి. ఇప్పటివరకూ ఇండియా కూటమికి ఓ సైద్దాంతికత నిర్వచించుకోలేదు. విదివిదానాలు ఖరారు కాలేదు. ఈ సమావేశంలో కూటమిలో పార్టీలు ఎలాంటి విధానాలు అనుసరించాలి. ముఖ్యంగా బీజేపీపై పోరాటంలో ఎలా ముందుకెళ్లాలి..? ఏయే అంశాలతో అజెండా ఏర్పాటు చేసుకోవాలి లాంటి కీలక అంశాలపై చర్చించే అవకాశముంది.
ఇదే సమయంలో ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపైనా చర్చ జరుగుతుందా అన్న ఆసక్తి రేగుతోంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ ..రాహుల్ ప్రధానమంత్రిగా ఆపార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. బెంగుళూరులో గృహలక్ష్మి ప్రారంభోత్సవం సందర్భంగానూ భావి ప్రధాని రాహుల్ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఓవైపు హైకమాండ్ .. ఎన్నికల తర్వాతే ప్రధాని అభ్యర్థిని కూటమి నేతలు ఎన్నుకుంటారని చెబుతున్నా.. హస్తం పార్టీ నేతలు మాత్రం ఆగడం లేదు.
మరోవైపు.. సమావేశానికి ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కీలక ప్రకటన చేసింది. ‘ఇండియా’ కూటమి తరుపున అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కేజ్రీవాల్ సరైన వ్యక్తి అంటూ ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక ఖక్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ దేశానికి ప్రయోజనం చేకూర్చే మోడల్‌ను తీసుకురాగలరని అన్నారు. తమ అభ్యర్థిగా కేజ్రీవాల్‌ను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆప్ ఢిల్లీ కన్వినర్ గోపాల్ రాయ్ కూడా ఈ అంశంపై స్పందించారు. కూటమిలో తాము కూడా భాగం అయినందున తమ అభ్యర్థిని ప్రధానిని చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే దీన్ని ఆప్ మంత్రి ఖండించారు. కేజ్రీవాల్ పీఎం క్యాండిడేట్ కాదన్నారు.
అయితే ఈ కూటమి సమావేశాాలు జరగడానికి ముందే .. బీజేపీ కౌంటర్లు సార్ట్ చేసింది. అవినీతి సంపద దాచుకోవడంపైనే కూటమి దృష్టి ఉందని బీజేపీ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అవినీతి , బంధుప్రీతి, వారసత్వం ప్రాతిపదికనే కూటమి కట్టారని సెటైర్లు వేస్తున్నారు.. మోడీ సర్కార్ అవినీతి రహిత పాలన అందిస్తుందని.. అందుకే జనం గుండెల్లో మోడీ ఉన్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే కూటమి సమావేశాలు.. బీజేపీని కలవరపరుస్తున్నట్లు వారి ప్రకటనల్లో కనిపిస్తోంది. దీంతో అందుకు తగిన స్కెచ్ ను సైతం కమలం నేతలు సిద్ధం చేస్తున్నారు.













