శంఖారావం..!
కేంద్రంలోని ఎన్డీఏ కూటమిని గద్దె దించడమే లక్ష్యంగా విపక్ష ఇండియా అలయెన్స్ అడుగులేస్తోంది.ఇప్పటికే పలుదపాలుగా సమావేశాలు జరిపిన ఇండియా అలయెన్స్.. పోరాటానికి ఓ అజెండాను సైతం సిద్ధం చేసింది. విపక్షకూటమి తరపున తొలి బహిరంగసభను.. వచ్చే నెల్లో భోపాల్ లో నిర్వహించనుంది. కూటమి ఉమ్మడి సమావేశాలను దేశవ్యాప్తంగా చేపట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ నివాసంలో జరిగిన ఈభేటీకి… కమిటీ లోని 12 మంది సభ్యులు హాజరయ్యారు. బీజేపీ పాలనలో పెరిగిన అవినీతి, నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం ప్రధాన ఎజెండాగా ఈ సభలు జరుగుతాయి’ అని కమిటీ ఉమ్మడి ప్రకటనను వేణుగోపాల్ చదివి వినిపించారు.
ఈ సమావేశం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపిణీకి సంబంధించిన చర్చలను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని నిర్ణయించింది. మహారాష్ట్ర, తమిళనాడు, బిహార్ల్లో సీట్ల పంపకం సులువుగా కనిపిస్తుండగా, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్లో మాత్రం భాగస్వామ్య పక్షాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఎక్కడ ఏపార్టీకి బలముంటే.. ఆపార్టీ నేతృత్వంలో ఎన్నికల్లో పోటీ చేయాలన్న సూత్రం .. ఆచరణలో సాధ్యమయ్యేందుకు కూటమి పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలన్న డిమాండ్ ను కూటమిలో కొన్ని పార్టీలు తెరపైకి తీసుకొచ్చాయి. ఈ నినాదంతో ఎన్నికల్లో ముందుకెళ్లాలని భావిస్తున్నాయి. కులాల వారీగా గణన జరిగితే.. అది అంతిమంగా విపక్షాలకు లబ్ధి చేకూరుస్తుందన్న అభిప్రాయాలున్నాయి. ఇప్పటికే నితీష్ కుమార్.. తమ రాష్ట్రంలో దీన్ని పూర్తి చేశారు. అయితే హిందూత్వ ఓటు బ్యాంకుతో గెలుపు సాధిస్తున్న బీజేపీ మాత్రం కులగణనకు వ్యతిరేకంగా ఉంది. కులగణన పూర్తయితే, హిందూత్వ ఓటు బ్యాంకు చీలుతుందన్న ఆందోళన కమలనాథుల్లో ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పుంజుకోవడం, ప్రాంతీయ పార్టీలు సైతం బలంగా మారుతుండడంతో.. బీజేపీని ఓడిస్తామన్న ధీమా కూటమిలో కనిపిస్తోంది. దీనికి తోడు రాహుల్ జోడా యాత్ర -2 ప్రారంభం కానుండడంతో… కాంగ్రెస్ నేతల్లో విశ్వాసం కనిపిస్తోంది. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో గెలుపు సాధించగలిగితే, కూటమి ఉత్సాహం ద్విగుణీకృతమవుతుందని నేతలు భావిస్తున్నారు.













