కరోనా వేళ కోర్టుల కీలక పాత్ర!

కరోనా ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్నీ తానై వ్యవహరించింది. రాష్ట్రాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని రంగాలను తన పరిధిలోకి తీసుకుని ఎమర్జెన్సీ తరహా ఆదేశాలతో కరోనాను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా భారత్ కరోనాను అదుపు చేసిన పాత్రపే ప్రశంసలు వెల్లువెత్తాయి. భారత్ భేషుగ్గా కరోనాను కట్టడి చేసిందని కొనియాడాయి. కానీ సెకండ్ వేవ్ అలా లేదు. తీవ్రత అంచనాలకు అందట్లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా కరోనాను ఎలా కట్టడి చేయాలో తెలియక సతమతమవుతోంది. ఈ సమయంలో కోర్టులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అవసరమైన చోట జోక్యం చేసుకుంటూ ప్రభుత్వాలకు తగిన సూచనలిస్తున్నాయి.
సెకండ్ వేవ్ తీవ్రతపై ఇటీవల సుప్రీంకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తీవ్రతను ముందుగానే ఎందుకు అంచనా వేయలేకపోయారని ప్రశ్నించింది. అందుకు అనుగుణంగా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. లాక్ డౌన్ లాంటి నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేశామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపైన కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆక్సిజన్, ఆసుపత్రుల్లో బెడ్లు, రెమ్ డెసివిర్ లాంటి మందుల లభ్యతపై ప్రశ్నించింది. వీటిని నిత్యం ప్రర్యవేక్షించి ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించింది. అంతేకాదు.. వ్యాక్సిన్ ధరల్లో వ్యత్యాసంపైన కూడా కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. ఇలాంటి క్లిష్ట సమయాల్లో తయారీ సంస్థలపై నియంత్రణ లేదా అని ప్రశ్నించింది. ఢిల్లీ, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం తమపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయని సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు పలు ఆదేశాలిచ్చింది. తగిన నిర్ణయాలు తీసుకోకపోతే తామే ఆదేశాలివ్వాల్సి వస్తుందని హెచ్చరించింది. దీంతో కేంద్రం తగిన చర్యలు తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు.. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా హైకోర్టు పలు సందర్భాల్లో మందలించింది. హైకోర్టు అక్షింతలతోనే తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. కరోనా కేసులు పెరుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది హైకోర్టు. టెస్టుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటోందని.. మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపుతోందని.. హైకోర్టు ఆక్షేపించింది. నిర్దిష్ట గడువు ఇచ్చి చర్యలు తీసుకోవాలని సూచించింది. అయినా ప్రభుత్వం నుంచి తగిన సమాధానం రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులనే నేరుగా పిలిపించుకుంది. పరీక్షలు, కేసులు, మరణాలు, బెడ్లు.. లాంటివాటిని ఎప్పటికప్పుడు వెబ్ సైట్ లో పెట్టాలని ఆదేశించింది. కోవిడ్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. నైట్ కర్ఫ్యూ ముగుస్తున్నందున తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. దీంతో అప్పటికప్పుడు నైట్ కర్ఫ్యూను పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది ప్రభుత్వం. రెమ్ డెసివిర్ లాంటి మందులపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి. కేసులు ఇప్పటికే భారీగా పెరుగుతున్నాయని.. ఇంకా పెరిగితే వాటిని ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది హైకోర్టు. ఆక్సిజన్ అందక రోగులు చనిపోతున్నారని.. బెడ్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారని .. అలాంటి రోగుల పరిస్థితి ఏంటని నిలదీసింది. చనిపోయిన వాళ్లకు కనీస మర్యాదలతో దహన సంస్కారాలు నిర్విహించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది హైకోర్టు. కోవిడ్ పరిస్థితి, పర్యవేక్షణకు అమికస్ క్యూరీని నియమించిన హైకోర్టు.. సమగ్ర వివరాలు సమర్పించాలని అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇటు కేంద్రాన్ని ఆదేశించింది. ఓవరాల్ గా రాష్ట్రాలు కావచ్చు.. కేంద్రం కావచ్చు.. కొన్ని సందర్భాల్లో తర్జనభర్జన పడుతున్న సమయంలో కోర్టులు కీలక ఆదేశాలు ఇస్తున్నాయి.