Hindu Population: హిందువులంతా భారీగా పిల్లల్ని కనాలా..?
భారతదేశంలో గత కొంతకాలంగా జనాభా గణాంకాలు, ముఖ్యంగా మతపరమైన జనాభా నిష్పత్తిపై జరుగుతున్న చర్చ రాజకీయ రంగు పులుముకుంది. హిందువులు ఎక్కువ మంది పిల్లల్ని కనాలనే పిలుపులు ఒక వర్గం నుండి బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమని, విభజన రాజకీయమని మరో వర్గం విమర్శిస్తోంది. భారతదేశంలో జనాభా పెరుగుదల రేటు క్రమంగా తగ్గుతోంది. అయితే, వివిధ మతాల మధ్య ఈ రేటులో ఉన్న వ్యత్యాసం సామాజిక, రాజకీయ ఆందోళనలకు కేంద్రబిందువుగా మారింది.
హిందూ జనాభా శాతం తగ్గుతోందని, ఇతర మతాల ముఖ్యంగా ముస్లింల జనాభా శాతం వేగంగా పెరుగుతోందనే వాదన ఈ డిమాండ్‌కు ప్రధాన కారణం. భవిష్యత్తులో హిందువులు తమ స్వదేశంలోనే మైనారిటీలుగా మారిపోతారనే భయం పెంచుతున్నారు. భారతదేశంలో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) జనాభా ప్రాతిపదికన జరుగుతుంది. ఏ ప్రాంతంలోనైతే జనాభా పెరుగుదల తక్కువగా ఉంటుందో, అక్కడ రాజకీయ ప్రాముఖ్యత తగ్గుతుందనే ఆందోళన ఉంది. సరిహద్దు రాష్ట్రాల నుంచి జరుగుతున్న అక్రమ వలసల వల్ల స్థానిక జనాభా నిష్పత్తి మారిపోతోందని, దీన్ని ఎదుర్కోవాలంటే హిందూ జనాభా పెరగాలని కొందరు వాదిస్తున్నారు.
హిందువులు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఇటీవల పలువురు నేతలు, ఆధ్యాత్మిక గురువులు పిలుపునిచ్చారు. తాజాగా బీజేపీ ఎంపీ నవనీత్ రాణా హిందువులు నలుగురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. హిందువులు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఇలా చేయడం అత్యవసరమన్నారు. ఇంతకుముందు RSS చీఫ్ మోహన్ భగవత్ కూడా హిందూ జనాభా తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ కుటుంబాలు కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని గతంలో సూచించారు. ఇది కేవలం సంఖ్య కోసం మాత్రమే కాకుండా, దేశ సంస్కృతిని కాపాడటానికి అవసరమని ఆయన పేర్కొన్నారు. సాక్షి మహారాజ్, యతి నరసింహానంద్ లాంటి వాళ్లు కూడా గతంలో “హిందువులు ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలి” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ తరహా పిలుపులను కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇలా చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయనేది వాళ్ల ఆలోచన. జనాభాను మతంతో ముడిపెట్టడం వల్ల సమాజంలో పోలరైజేషన్ పెరుగుతుందని, ఇది మత విద్వేషాలకు దారితీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. దేశం ఇప్పటికే నిరుద్యోగం, పేదరికం, వనరుల కొరతతో సతమతమవుతోంది. ఇలాంటి సమయంలో జనాభాను పెంచమనడం దేశ పురోగతికి ఆటంకమని వారి వాదన. ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఒత్తిడి చేయడం మహిళల శారీరక ఆరోగ్యాన్ని, వారి స్వయంప్రతిపత్తిని దెబ్బతీయడమేనని మహిళా సంఘాలు కూడా విమర్శిస్తున్నాయి. “అభివృద్ధే ఉత్తమ గర్భనిరోధకం” అని కాంగ్రెస్ నేతలు వాదిస్తారు. విద్య, ఆరోగ్యం మెరుగైన చోట జనాభా సహజంగానే తగ్గుతుందని, దాన్ని మతపరంగా చూడకూడదని వారు కోరుతున్నారు.
అయితే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS-5) ప్రకారం, భారతదేశంలోని అన్ని మతాలలో సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది. ముస్లింలలో తగ్గుదల రేటు హిందువుల కంటే వేగంగా ఉంది. 1992-93 మధ్య హిందువల్లో సంతానోత్పత్తి రేటు 3.3గా ఉంటే ముస్లింలలో 4.4గా ఉండేది. 2019-21 నాటికి హిందువల్లో అది 1.9కి పడిపోతే, ముస్లింలలో 2.4కు దిగజారింది. దీన్నిబట్టి మతాలకతీతంగా సంతానోత్పత్తి రేటు తగ్గుతోందని అర్థమవుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, జనాభా పెరుగుదల అనేది మతం కంటే ఎక్కువగా విద్య, ఆదాయ స్థాయి, ప్రాంతీయతపై ఆధారపడి ఉంటుంది.
హిందూ జనాభా పెరగాలనే డిమాండ్ వెనుక సాంస్కృతిక అభద్రతాభావం, రాజకీయ వ్యూహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, ఆధునిక ఆర్థిక వ్యవస్థలో జనాభా నియంత్రణ అనేది వనరుల సమతుల్యతకు అత్యవసరం. కేవలం సంఖ్యను పెంచడం కంటే, ఉన్న జనాభాకు నాణ్యమైన విద్య, నైపుణ్యం, ఉపాధి కల్పించడంపై దృష్టి సారించడమే దేశ సమగ్ర అభివృద్ధికి మార్గమని విశ్లేషకులు భావిస్తున్నారు.






