అవినీతి కేసులో హేమంత్ సొరెన్ అరెస్ట్…
జార్కండ్లో రాజకీయ చదరంగం.. జార్ఘండ్ రాజకీయ చదరంగంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవినీతి కేసులో హేమంత్ సొరెన్ అరెస్టయ్యారు. ఏడుగంటల పాటు విచారించిన ఈడీ అధికారులు.. ఎట్టకేలకు అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఈపరిణామం జార్ఖండ్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. అంతకు ముందు హేమంత్ సొరెన్ సీఎం పదవికి రాజీనామా ప్రకటించారు. తన తండ్రి శిబుసొరెన్ ఆశీర్వాదం తీసుకున్నారు.గతంలో శిబూసొరెన్ సైతం.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు.
హేమంత్ సోరెన్ రాజీనామా నేపథ్యంలో కొత్త శాసనసభాపక్షనేతగా చెంపై సొరెన్ ను పార్టీనేతలు ఎన్నుకున్నారు. ఈయన త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముందుగా హేమంత్ సొరెన్ భార్య కల్పనకు కొత్తముఖ్యమంత్రిగా అవకాశం వస్తుందని ప్రచారం జరిగింది. దీనికి తగినట్లుగానే జార్కండ్ ఎమ్మెల్యేలు 49 మందిలో 35 మంది కల్పనకు మద్దతిచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే కల్పనకు సీఎం పదవి ఎలా ఇస్తారంటూ పెద్దకోడలు సీతా సొరెన్ అడ్డుతగిలారు. కల్పనకు ఉన్న అర్హత ఏంటని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ ఇద్దరి గొడవతో కుటుంబంలో సమస్యలు వస్తాయని భావించిన హేమంత్ సొరెన్.. సీనియర్ రాజకీయవేత్త చంపై సొరెన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు.
కొత్త సీఎంగా చంపై సోరెన్?
చంపై సోరెన్ సెరైకెల్లా నియోజవకర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జేఎంఎంలో చేరకముందు ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం రవాణాశాఖ మంత్రిగా ఉన్నారు. ఝార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన సెరికెల అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1991 నుంచి 3 దశాబ్దాలుగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. జేఎంఎం అధినేత శిబు సోరెన్‌కు అత్యంత సన్నిహితుడు. 1956లో జిలింగోరా గ్రామంలో చంపయీ సోరెన్ జన్మించారు. మెట్రిక్యులేషన్ చదివారు. ఆయనకు ఏడుగురు పిల్లలున్నారు. శిబు సోరెన్‌తో ఎటువంటి బంధుత్వం లేదు. చంపై.. జార్ఖండ్ టైగర్‌గా పేరొందారు.
మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఒకవైపు విచారణ చేస్తుండగా, మరోవైపు ఈడీ ఆధికారులపై హేమంత్ పోలీసు కేసు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాంచీలోని ఎస్సీ, ఎస్టీ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. భూ కుంభకోణం కేసులో గత పది రోజుల్లో హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించడం ఇది రెండోసారి. ఈనెల 20న హేమంత్ సోరెన్‌ను 7 గంటలకు పైగా అధికారులు ప్రశ్నించారు. సీఎంను అరెస్ట్ చేస్తారన్న సమాచారంతో రాజ్‌భవన్, సీఎం నివాసం, ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. ఈ క్రమంలోనే జేఎంఎం ఎమ్మెల్యేలు సీఎం నివాసం వద్ద బలప్రదర్శనకు దిగారు. కేంద్రం ఆదేశాల మేరకే తమ నేతను ఈడీ వేధిస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా ఆర్థిక దిగ్బంధాలకు దిగుతామని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.













