విద్వేషాగ్నిలో హర్యానా..
మణిపూర్ హింసాగ్ని కొనసాగుతోంది. ఆ రాష్ట్రం రావణకాష్టంలా మారింది. ఇంతలో హర్యానాలో మతవిద్వేషాగ్ని చెలరేగింది. సోమవారం నుహ్ జిల్లాలో విహెచ్పీ చేపట్టిన బ్రిజ్ మండల్ జలాభిషేక యాత్రలో మొదలైన హింస.. మతఘర్షణలకు దారితీసింది.మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు దేవాలయాలు, అటు మసీదులను ఆందోళన కారులు ధ్వంసం చేస్తున్నారు. మరోవైపు నుహ్ లో చెలరేగిన హింసాగ్ని.. పక్కనున్న ప్రాంతాలకు విస్తరించడం ప్రారంభించింది
హర్యానా అల్లర్లు సృష్టించిన ప్రకంపనలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల ఇంకా ఉద్రిక్త వాతావరణమే ఉండడంతో మరిన్ని కేంద్ర బలగాలను పంపించాలని అక్కడి ప్రభుత్వం.. కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అల్లర్ల కారకుల్ని గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను నియమించాలని హరియాణా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రాష్ట్రంలోని ఘటనల ప్రభావం ఢిల్లీపై పడేలా కనిపించడంతో దేశ రాజధానిలో భద్రత కట్టుదిట్టం చేశారు. అల్లర్లపై విశ్వహిందూ పరిషత్ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. దీనిలో బజరంగ్దళ్ కూడా పాలుపంచుకుంది. భద్రత ఏర్పాట్ల నడుమ కొన్నిచోట్ల హనుమాన్ చాలీసా పఠించారు.
హర్యానాకు మరో నాలుగు కంపెనీల కేంద్ర బలగాలను పంపించాలని ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించినవారు దానికి పరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని శాంతి భద్రతలపై పోలీసులు హామీ ఇవ్వలేరని, తాము ప్రతిఒక్కరినీ రక్షించలేమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రాన్ని కాపాడాల్సిన ఉన్నతమైన పదవిలో ఉండి.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
పొరుగున ఉన్న హరియాణాలో హింస చెలరేగడంతో ఢిల్లీలో అదనపు బలగాలను మోహరించారు. హరియాణాతో సరిహద్దు ఉన్న యూపీలోని జిల్లాలను అప్రమత్తం చేశారు. అసాంఘిక శక్తులు చొరబడకుండా రెండు రాష్ట్రాల సరిహద్దులో చర్యలు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతిభద్రతల్ని పర్యవేక్షించడానికి డ్రోన్లనూ రంగంలో దించారు. మరోవైపు నూహ్ జిల్లాలో ఘర్షణలు గురుగ్రామ్ సహా చుట్టుపక్కల ప్రాంతాలపైనా ప్రబావం చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితిని తామెప్పుడు ఎదుర్కోలేదని గురుగ్రామ్ వాసులు చెబుతున్నారు. కళ్లముందే దాడులకు దిగుతూ సర్వం నాశనం చేస్తున్నారని వాపోతున్నారు. ఇది ఎక్కడ మరింత తీవ్రమై తమ బతుకులను చిదిమేస్తుందా అన్న భయం వారిలో కనిపిస్తోంది.













