హమాస్ ఆవిర్భావం వెనక..?
పాముకు పాలు పోసి పెంచితే కాటు వేయక తప్పదు. ఇదే విషయం ఆఫ్గనిస్తాన్ యుద్ధంలో తాలిబన్లు.. అమెరికాకు నిరూపించారు. ఇప్పుడు ఇజ్రాయెల్ కు హమాస్ ఉగ్రవాద సంస్థ.. కూడా అదే ఫలితాల్ని చవిచూపించింది. దీంతో హమాస్ నుపూర్తిగా లేకుండా చేయాలన్న సంకల్పంతో ఇజ్రాయెల్.. అన్నిప్రయత్నాలు చేస్తోంది. ఇక చివరి ప్రయత్నం గ్రౌండ్ ఎటాక్. దీనికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా సంకేతాలు కూడా వచ్చాయి.
శత్రువుకు శత్రువు మిత్రుడు.. ఈ సూత్రం ఆధారంగానే హమాస్‌కు చేయూతనిచ్చింది ఇజ్రాయెల్. పాలస్తీనా ఏర్పాటు లక్ష్యంగా 1950ల చివర్లో ఏర్పడ్డ ఫతా అనే సంస్థ ఇజ్రాయెల్‌పై సాయుధ దాడులకు సిద్ధమైంది. దీని అధిపతి యాసర్ అరాఫత్. తర్వాతి కాలంలో ఆయన సారథ్యంలోనే అనేక అరబ్ గ్రూపులు కలిసి పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌గా (పీఎల్‌వో) ఏర్పడ్డాయి. ఇది మత ఛాందస సంస్థ కాదు. లౌకిక జాతీయవాద, వామపక్ష సంస్థ. 1969లో పీఎల్‌వో ఛైర్మన్ అయిన అరాఫత్ 2014లో చనిపోయేదాకా ఆ పదవిలో ఉన్నారు. మొదట్లో సాయుధ బాటలో ఇజ్రాయెల్‌కు ఇబ్బందులు సృష్టించింది పీఎల్‌వో. అంతేగాకుండా అంతర్జాతీయ సమాజం ముందు పాలస్తీనా గళాన్ని బలంగా వినిపించింది. అరబ్‌లీగ్‌తో పాటు, ఐక్యరాజ్య సమితి పీఎల్‌వోను పాలస్తీనీయుల చట్టబద్ధ ప్రతినిధిగా గుర్తించాయి. అలా ఇజ్రాయెల్‌కు అరాఫత్, పీఎల్వోలు కంట్లో నలుసుగా మారాయి. దీంతో ఈ పీఎల్‌వో, అరాఫత్‌ను బలహీన పరచాలని ఇజ్రాయెల్ ఆలోచించింది.
ఈ క్రమంలో వారికి గాజాలో కనిపించిన వ్యక్తి షేక్ అహ్మద్ యాసిన్. 1966 దాకా గాజా ప్రాంతం ఈజిప్టు పాలనలో ఉంది. 1967లో జరిగిన అరబ్, ఇజ్రాయెల్ యుద్ధంతో పరిస్థితి మారింది. యుద్ధంలో ఇజ్రాయెల్ నెగ్గటంతో గాజా వారి వశమైంది. ఇదే సమయంలో చక్రాల కుర్చీకి పరిమితమైన ఓ ఇస్లాం మత విద్యావేత్త షేక్ అహ్మద్ యాసిన్ ఇజ్రాయెల్ దృష్టిలో పడ్డాడు. యాసర్ అరాఫత్‌ను, పీఎల్‌వోను యాసిన్ వ్యతిరేకించేవారు. దీంతో శత్రువుకు శత్రువు మిత్రుడైనట్లు.. సహజంగానే ఇజ్రాయెల్‌ను యాసిన్ ఆకర్షించాడు. ఆయన ముజామా అల్ ఇస్లామియా అనే సంస్థను స్థాపించి గాజాలోని పాలస్తీనీయుల కోసం ధార్మిక కార్యక్రమాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు నడిపేవాడు. వాటిని ఇజ్రాయెల్ గుర్తించింది. అరాఫత్‌ను కట్టడి చేసే వ్యూహంలో భాగంగా పాలస్తీనియన్లను విభజించి పాలించాలని చూసింది. అందుకే గాజాలో ఇస్లామిక్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు యాసిన్‌కు సహకరించింది.
పీఎల్వోతో విభేదించేలా ఆర్థికంగా యాసిన్‌కు ఇజ్రాయెల్ సాయం చేసింది. ఈ క్రమంలో ముజామా అల్ ఇస్లామియా సాయుధ బాటలోకి దిగుతోందని గుర్తించినా పీఎల్వోతో పోలిస్తే ఇది తక్కువ ప్రమాదకారి అనే ఉద్దేశంతో చూసీచూడనట్లు వదిలేసింది. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారనే కారణంతో 1984లో యాసిన్‌ను ఇజ్రాయెల్ అరెస్టు చేసింది. 12 ఏళ్ల జైలు శిక్ష పడింది. కానీ అరాఫత్ కంటే యాసిన్ తక్కువ ప్రమాదకరమని మరుసటి ఏడాదే విడిచిపెట్టింది. బయటకు వచ్చిన రెండేళ్లకే.. అంటే 1987లో యాసిన్ హమాస్‌ను ఏర్పాటు చేశారు. సరిగ్గా అదే సమయంలో ఇజ్రాయెల్ ఆక్రమణను నిరసిస్తూ పాలస్తీనీయులు భారీ ఎత్తున తిరుగుబాటుకు దిగారు. దీన్నే తొలి తిరుగుబాటుగా పిలుస్తారు. దానిని ఇజ్రాయెల్ అణచివేసింది. ప్రజల్లోని ఈ వ్యతిరేకతను హమాస్ బాగా సొమ్ము చేసుకుంది. 1988లో గాజాలో ఇజ్రాయెల్ సైనికులను కాల్చి చంపడం ద్వారా హమాస్ పేరు మారుమోగింది.
ఆయుధాలు వీడిన అరాఫత్..
పాలస్తీనీయులు అసంతృప్తితో ఉన్న సమయంలో యాసర్ ఆరాఫత్ సారథ్యంలోని పీఎల్‌వో ఆయుధాలను వీడి రాజకీయ చర్చల బాట పట్టింది. ఇజ్రాయెల్‌తో సయోధ్యకు సిద్ధమైంది. ఇజ్రాయెల్‌ను యూదు దేశంగా గుర్తించింది. చాలామంది పాలస్తీనియన్లకు అరాఫత్ మెతక వైఖరి రుచించలేదు. ఇదే అదనుగా హమాస్ విజృంభించింది. గాజాలో ఆధిపత్యం కోసం పీఎల్‌వో, హమాస్‌ల మధ్య అంతర్యుద్ధం కొనసాగింది. దీన్ని చూసి ఇజ్రాయెల్ సంబరపడింది. 2004లో వైమానిక దాడిలో యాసిన్‌ను హతమార్చినా అప్పటికే హమాస్ బలపడింది. ఆ తరువాత ఇజ్రాయెల్ దళాలపైనా హమాస్ దాడులను తీవ్రతరం చేసింది. సైనికులను చంపింది. తద్వారా పాలస్తీనియన్లకు సరికొత్త సారథిగా ఎదగడం ఆరంభించింది. 2006లో జరిగిన గాజా ఎన్నికల్లో పీఎల్‌వో ఓడిపోయి హమాస్ పట్టు పెంచుకుంది. ఆనాటి నుంచి ఇప్పటిదాకా హమాసే అక్కడ రాజ్యమేలుతోంది. పీఎల్‌వో అధినేత యాసర్ అరాఫత్ సైతం హమాస్ సృష్టికర్త ఇజ్రాయెలే అనేవారు. ఇప్పుడదే హమాస్ ఇజ్రాయెల్‌పై వినూత్న దాడులు, కిడ్నాప్లతో దడ పుట్టిస్తోంది.













