మోదీ ఇమేజ్ గుజరాత్ కే పరిమితమా?…
ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన తరువాత అందరూ ఆ గెలుపు మోదీ ఇమేజ్ వల్లనే సాధ్యమైందని చెబుతున్నారు. దానికి కూడా ఓ కారణం ఉంది. గుజరాత్లో వరుసగా అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వంపై సహజంగానే ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ ఎన్నికల్లో తప్పకుండా బిజెపి ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్టు అక్కడ ఉన్న కొందరు ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి కూడా బిజెపి ఓటమికి కారణమవుతుందని భావించారు. కాని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్ ఎన్నికల్లో చేసిన సుడిగాలి ప్రచారం ఓటర్ మనస్సులో తన తీర్పును మార్చుకునేలా చేసిందని చెప్పడంలో తప్పులేదు. మోదీని చూసే అక్కడి ప్రజలు బిజెపిని గెలిపించారని చెబుతున్నారు. దానికి తగ్గట్టు విపక్షాలు కూడా సరైన విధంగా ప్రచారాన్ని వ్యూహాన్ని అనుసరించడంలో విఫలం కావడం కూడా పాలపక్ష పార్టీ విజయానికి దోహదం చేసిందని అంటారు. కాని మీడియా మాత్రం దేశంలో మోడీ మ్యానియా జోరుగా ఉందని ప్రచారం చేసింది. దానికి తోడు మోడీ ఈ దేశానికి దిక్సూచి అని.. ఆయన హయాంలో దేశంలో అనేక సంచలనాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారాలు సాగాయి. అదే సమయంలో గుజరాత్‌తోపాటు హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఎన్నికలు జరిగాయి.
ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అదేవిధంగా అత్యంత కీలకమైన బీజేపీ పాలిత రాష్ట్రం యూపీలోని ఒక పార్లమెంటు స్థానానికి కూడా ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలను కూడా బీజేపీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడారు. కేంద్ర మంత్రులను కూడా మోహరించి యూపీలోని మెయిన్‌పురి(ములాయం సింగ్ మరణంతో జరిగిన పోలింగ్) నియోజకవర్గంలో కలియదిరిగారు. చనిపోయిన నాయకుడిపైనా అవినీతి ఆరోపణలు చేశారు. కుటుంబ రాజకీయం అన్నారు. మోడీ వల్లే యూపీ అభివృద్ధి అన్నారు. మరి ఇంత చేసినా.. ఇక్కడ బీజేపీకి డిపాజిట్లు దక్కలేదు. ఇక్కడ మోదీ మ్యాజిక్ పనిచేయలేదని చెప్పవచ్చు. అలాగే హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ చేతిలో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. 68 స్థానాలున్న అసెంబ్లీలో కేవలం 20కే కమల నాథులు పరిమితం అయ్యారు. ఇక్కడ ప్రధాని మోడీ విస్తృతంగా ప్రచారం చేశారు.
అంతేకాదు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సొంత రాష్ట్రం. అంతేనా కేంద్రమంత్రి అనురాగ్ సింగ్‌కు కూడా ఇది సొంత రాష్ట్రమే. మరి ఇక్కడ మోడీ మ్యానియా పనిచేయలేదు. రాజస్థాన్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో బీజేపీ పరాజయం పాలైంది. ఛత్తిస్ ఘడ్ ఉప ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్ విజయం దక్కించుకుంది. ఒడిశా అసెంబ్లీసీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార నవీన్ పట్నాయక్ బీజేపీని ఓడించారు. బీహార్ అసెంబ్లీ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో నితీష్ కుమార్ చేతిలో ఓడిపోయింది. ఉత్తర్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో ఎంపి రెండు ఎమ్మెల్యే సీట్లను బీజేపీ గెలుచుకోలేకపోయింది. ఇక కీలకమైన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ చేతిలో బీజేపీ పరాజయం పాలైంది. అంటే.. మొత్తంగా చూస్తే గుజరాత్ మినహా.. ఎక్కడా మోడీ మ్యానియా కనిపించలేదు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అందరినీ సంతోషపెట్టలేకపోయినా ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల కొన్ని చోట్ల ఇప్పటికీ మోదీకి ఆదరణ తగ్గలేదన్నది వాస్తవం.













