గుజరాత్ మళ్లీ బీజేపీదే..! కాంగ్రెస్ రికార్డ్ బద్దలు..!!
గుజరాత్ లో బీజేపీకి తిరుగులేదని మరోసారి నిరూపితమైంది. గత ఎన్నికలకు మించి సీట్లను కైవసం చేసుకుంది. ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతుందని.. దానివల్ల సీట్లు తగ్గుతాయని భావించిన బీజేపీకి ఈసారి గుజరాత్ ఓటర్లు గతంలో ఎన్నడూ లేనన్ని సీట్లు ఇచ్చి కమల జెండాను రెపరెపలాడించారు. ఈసారి గుజరాత్ లో కచ్చితంగా ఓడిస్తామని భావించిన కాంగ్రెస్ కు ఆ ఆశ నెరవేరలేదు. మరోవైపు.. బీజేపీకి తామే గట్టి ప్రత్యామ్నాయం అని ప్రచారం చేసుకున్న ఆప్ కూడా సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితమైంది. అయితే గుజరాత్ లో ఆప్ బోణీ కొట్టడంతో పాటు ఓటుశాతం భారీగా రావడం ఆ పార్టీకి ఆశలు రేకిత్తిస్తోంది.
గుజరాత్ లో బీజేపీ మరోసారి గర్జించింది. 1995 నుంచి గుజరాత్ లో బీజేపీదే అధికారం. అయితే ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీకి సీట్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. దీంతో ఈసారి బోల్తా పడుతుందేమోననే భయం బీజేపీని వెంటాడింది. అందుకే ప్రధానిగా ఉన్నా కూడా మోదీ అన్నీ తానై వ్యవహరించారు. గత మూడు నెలలుగా అక్కడే మకాం వేసినంత పని చేశారు. బీజేపీకి గుజరాత్ లో అధికారం ఆయువుపట్టు లాంటింది. అక్కడి నుంచే మోదీ ఎదిగారు. అక్కడ సీఎంగా పనిచేసిన మోదీ పీఎంగా బాధ్యతలు చేపట్టారు. అందుకే తనను ఇంతటివాణ్ణి చేసిన గుజరాత్ ను కాపాడుకోవాలనుకున్నారు. ఎట్టకేలకు సాధించారు.
గుజరాత్ లో గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి బీజేపీకి సీట్లు పెరగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మొత్తం 185 స్థానాలున్న గుజరాత్ లో 1995లో బీజేపీకి 121 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత 1998లో జరిగిన ఎన్నికల్లో 117 సీట్లు దక్కించుకుంది. ఇక 2022లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా మోదీని ప్రకటించింది బీజేపీ. ఆ ఎన్నికల్లో 127 స్థానాల్లో విజయం సాధించింది కమలం పార్టీ. ఆ తర్వాత 2007 ఎన్నికల్లో 10 సీట్లను కోల్పోయి 117 సీట్లలో బీజేపీ గెలుపొందింది. అనంతరం.. 2012లో కూడా సీట్లు తగ్గాయి. అప్పుడు 115 సీట్లలో బీజేపీ విజయం సాధించింది. ఆ తర్వాత 2017లో గుజరాత్ ఎన్నికలను బీజేపీ అత్యంత సీరియస్ గా తీసుకుంది. అప్పటికే మోదీ ప్రధానిగా ఉండడంతో ఇక్కడ సీట్లు పెంచుకోవాలని బీజేపీ ఎంతో తపించింది. అయితే పాటిదార్ ఉద్యమం బీజేపీ ఆశలపై నీళ్లు చల్లిందగి. ఇక్కడ 2017లో బీజేపీకి 99 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో 2022 ఎన్నికల్లో బీజేపీ బోల్తా కొట్టడం ఖాయమని అందరూ భావించారు.
అయితే అందరి అంచనాలను తలకిందులు చేసింది బీజేపీ. ఈసారి ఎలాగైనా 150 మార్క్ క్రాస్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. వాస్తవానికి గతంలో ఎన్నడూ ఏ పార్టీకీ ఇక్కడ 150 సీట్లు రాలేదు. 1985లో కాంగ్రెస్ పార్టీకి 149 సీట్లు వచ్చాయి. ఇదే ఇప్పటి వరకూ ఒక పార్టీకి దక్కిన హయ్యస్ట్ సీట్స్. ఈసారి ఈ రికార్డును బద్దలు కొట్టాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. అందుకు తగ్గట్లే మోదీ, అమిత్ షా వ్యూహరచన చేశారు. ఢిల్లీని వదిలి గుజరాత్ లోనే మకాం వేశారు. గతానికి భిన్నంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందే ప్రకటించి ఎన్నికలకు వెళ్లారు. ఏదైతేనేం బీజేపీ అనుకున్నది సాధించింది. దేశవ్యాప్తంగా గుజరాత్ మోడల్ అని ప్రచారం చేస్తున్న బీజేపీకి అక్కడ భారీ విజయం దక్కడం కచ్చితంగా కలిసొచ్చే అంశమే.













