మహిళా రిజర్వేషన్ బిల్ అంశాలు..
చారిత్రక సమయమిది..
మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ల అంశం చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈబిల్లుకు అధికార, ప్రధాన ప్రతిపక్షం మద్దతు తెలిపాయి. దశాబ్దాల తరబడి ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ వచ్చిన ఈ బిల్లు… ఇప్పుడు కార్యరూపం దాల్చింది. రాజ్యాంగం ప్రకారం ఈ బిల్లును అమల్లోకి తెచ్చేందుకు ఎలాంటి విధానాలు అవసరం. ముఖ్యంగా కొన్నిపార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న తరుణంలో వీటికి ఉన్న అడ్డంకులేంటి?
మహిళా రిజర్వేషన్ బిల్ ప్రకారం లోక్‌సభ, రాష్ట్రాల్లోని అసెంబ్లీలు, ఢిల్లీ అసెంబ్లీలో మూడో వంతు సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయి. అంటే, 543 లోక్‌సభ స్థానాల్లో 181 సీట్లు మహిళలకు రిజర్వ్ చేస్తారు.ప్రస్తుతం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ)ల కోసం రిజర్వ్ చేసిన సీట్లు ఉన్నాయి. ఆ రిజర్వ్ చేసిన స్థానాల్లో ఇప్పుడు మూడోవంతు సీట్లను మహిళలకు కేటాయిస్తారు. ప్రస్తుతం ఎస్సీలు, ఎస్టీల కోసం 131 సీట్లను రిజర్వ్ చేశారు. వీటిల్లో నుంచి సుమారు 43 సీట్లు మహిళలకు కేటాయించనున్నారు. ఈ 43 సీట్లను కూడా సభలో మహిళలకు రిజర్వ్ చేసిన మొత్తం సీట్లలో భాగంగానే లెక్కిస్తారు. అంటే, మహిళలకు రిజర్వ్ అయ్యే 181 స్థానాల్లో, 138 సీట్లు జనరల్ కేటగిరీ మహిళలకు అందుబాటులో ఉంటాయి. అయితే, ఈ లెక్కలన్నీ ప్రస్తుతం లోక్‌సభలో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య ఆధారంగా చేసినవి. ఒక్కసారి డీలిమిటేషన్ కసరత్తు మొదలైతే ఈ గణాంకాలు మారొచ్చు.
అమలుకు ముందు..
ఈబిల్లును పార్లమెంట్‌లోని ఉభయసభలు మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదించాలి. జనగణన (సెన్సస్) తర్వాత డీలిమిటేషన్ జరగాల్సి ఉంటుంది. డీలిమిటేషన్ అంటే జనాభా ప్రకారం నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించే ప్రక్రియ. దేశవ్యాప్త డీలిమిటేషన్ ప్రక్రియ చివరిసారిగా 2002లో జరిగింది. ఇది 2008లో అమల్లోకి వచ్చింది. డీలిమిటేషన్ జరిగిన తర్వాత లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు అయ్యాక మహిళా రిజర్వేషన్ అమల్లోకి రావొచ్చు. ప్రాక్టికల్‌గా చూస్తే, ఈ రిజర్వేషన్ల అమలు 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందువరకు సాధ్యం కాదని అనిపిస్తోంది.
ఎస్సీ, ఎస్టీ మహిళలకు..
మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాక 15 ఏళ్ల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఎస్సీ, ఎస్టీలకు కూడా ఒక పరిమిత సమయం వరకే సీట్లను రిజర్వ్ చేస్తారు. తర్వాత వాటిని పదేళ్లపాటు పొడిగిస్తారు. ప్రతీ డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత రిజర్వ్డ్ సీట్లను రొటేట్ చేస్తామని బిల్లులో తెలిపారు. ఈ వివరాలను పార్లమెంట్ తర్వాత నిర్ణయిస్తుంది. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళా రిజర్వేషన్లను ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వానికి ఈ రాజ్యాంగ సవరణ అధికారాన్ని కల్పిస్తుంది. అయితే సీట్ల రొటేషన్, డీలిమిటేషన్ చేపట్టడానికి ఒక ప్రత్యేక చట్టం, నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. పంచాయతీలు, మున్సిపాలిటీలు వంటి స్థానిక సంస్థల్లో కూడా మూడోవంతు సీట్లు మహిళల కోసం కేటాయించారు. ప్రతీ ఎన్నికల సందర్భంగా ఇవి కూడా మారుతుంటాయి. ఎస్సీలకు నియోజకవర్గాల్లో వారి జనాభా ఎక్కువగా ఉన్నచోట సీట్లను రిజర్వ్ చేశారు.
లడఖ్, పుదుచ్చేరి, చండీగఢ్ వంటి కేవలం ఒక ఎంపీ సీటు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల్లో రిజర్వేషన్ ఎలా ఉంటుందో ఇంకా నిర్ణయించలేదు. ఈశాన్య రాష్ట్రాలైన మణిపుర్, త్రిపురల్లో రెండు చొప్పున, నాగాలాండ్‌లో ఒకే ఎంపీ స్థానం ఉంటుంది. అయితే, మునుపటి మహిళా రిజర్వేషన్ బిల్లులో ఈ అంశానికి ఒక పరిష్కారం చూపారు. ఒకే సీటు ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో… ఒక లోక్‌సభ ఎన్నికల్లో ఆ సీటును మహిళలకు కేటాయించి, తర్వాతి రెండు ఎన్నికలకు దాన్ని రిజర్వ్ చేయకూడదని 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లులో పేర్కొన్నారు. రెండు సీట్లు ఉన్న రాష్ట్రాల్లో ఒక సీటును రెండు లోక్‌సభ ఎన్నికల వరకు రిజర్వ్ చేసి, మూడో ఎన్నికలో మహిళలకు ఎలాంటి రిజర్వేషన్ కేటాయించకూడదని నిర్ణయించారు.













