‘భారత మండపం’ ప్రత్యేకతలు..
జి-20 సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఢిల్లీలోని ప్రగతి మైదానంలో ఇటీవల నిర్మించిన భారత్ మండపం వేదికగా 9, 10 తేదీల్లో జరిగే సదస్సుకు హాజరయ్యే ఆహుతులు, వివిధ దేశాల అధ్యక్ష, ప్రధానులు, ముఖ్య అతిధులు అబ్బురపడేలా కేంద్రం చర్యలు తీసుకుంది. భారత్ మండపానికి దారి తీసే మార్గాల్లో… భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, వేదాలకు సంబంధించిన అంశాలపై వేరువేరుగా ప్రదర్శనలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. ముఖ్య అతిథులకు వెండి, బంగారు పాత్రల్లో భోజనాల వడ్డన మొదలు.. దేశాధినేతల సతీమణులకు చిరుధాన్యాలతో విందు, వారి భద్రతకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాల వినియోగం, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ నిరంతర నిఘా, 50 వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నారు.
ప్రగతి మైదాన్ కాంప్లెక్స్‌లో భాగంగా భారత్ మండప కన్వెన్షన్ సెంటర్ అభివృద్ధి చేయబడింది. కన్వెన్షన్ సెంటర్ భవనం నిర్మాణ రూపకల్పన భారతీయ సంప్రదాయాల నుండి ప్రేరణ పొందింది. సౌరశక్తిని వినియోగించుకోవడంలో భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను హైలైట్ చేయడానికి వివిధ గోడలు, ముఖభాగాలు కూడా నిర్మించబడ్డాయి. ఈ భారత్ మండపంలో మల్టీపర్పస్ హాల్, ప్లీనరీ హాల్ రెండూ కలిపి 7000 మంది కూర్చునే సామర్ధ్యం ఉంది. ఈ హాల్ ఆస్ట్రేలియాలోని పాపులర్ సిడ్నీ ఒపెరా హౌస్ సీటింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ. ఇక్కడి యాంఫిథియేటర్‌లో 3000 మంది కూర్చునే సామర్థ్యం ఉంది.
ప్రగతి మైదాన్‌లోని ఈ IECC క్యాంపస్‌లో అనేక ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఇందులో అనేక సమావేశ గదులు, లాంజ్‌లు ఇంకా ఆడిటోరియంలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న బిజినెస్ సెంటర్ పెద్దపెద్ద ఈవెంట్లను నిర్వహించడానికి ఉపకరిస్తుంది. దీనికి తోడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన (28 అడుగుల ఎత్తు) నటరాజ విగ్రహం ఈ భారత మండపం ముందు ఉంది.
సుమారు 123 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ కాంప్లెక్స్ భారతదేశపు అతిపెద్ద MICE (మీటింగ్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్స్)గా అభివృద్ధి చేయడం జరిగింది. పెద్ద ఎత్తున అంతర్జాతీయ ప్రదర్శనలు, వాణిజ్య ప్రదర్శనలు, సమావేశాలు ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాలను నిర్వహించడానికి రూపొందించబడింది.
క్రీస్తుపూర్వం 2,500 సంవత్సరాల నాటి హరప్పా నాగరికతకు చెందిన నాట్యగత్తే విగ్రహం.. ఈ సదస్సుకు వచ్చే అతిధులకు ఆహ్వానం పలుకుతుంది. నిజానికి హరప్పా తవ్వకాల్లో దొరికిన నాట్య గత్తే విగ్రహం ఎత్తు 10.5 సెంటీమీటర్లు. కాగా భారత్ మండపం వద్ద ఐదు అడుగుల ఎత్తు, 120 కిలోల కాంస్యం తో తయారుచేసిన హరప్పా యువతిని పోలిన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ప్రాంగణంలోని మదర్ ఆఫ్ డెమోక్రసీ ఎగ్జిబిషన్ వద్ద ఏర్పాటు చేశారు.. అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో ఏర్పాటుచేసిన అవతార్.. 16 భాషల్లో అతిథులకు స్వాగతం పలుకుతుంది.
ఐదు వేల సంవత్సరాల క్రితమే భారత్ లో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లింది అని చెప్పే విధంగా మదర్ ఆఫ్ డెమోక్రసీ ప్రదర్శన ఉంటుందని తెలుస్తోంది. సింధు నాగరికత కాలంలో ప్రజాస్వామ్య తీరు మొదలు, షోడష జానపదాల కాలం దాకా.. ప్రజలే పాలకులను ఎన్నుకునే పద్ధతిని ఈ ప్రదర్శనలో వివరిస్తారని తెలుస్తోంది. రాజరికాలు మొదలై బ్రిటిష్ పరిపాలన.. భారత్ స్వాతంత్రం పొందే దాకా జరిగిన సమగ్ర చరిత్రను అక్కడ అందుబాటులో ఉంచనున్నారు. రాజ్యాంగాన్ని పోలిన చాణక్యుడి రాజనీతి సూత్రాలు, వాటి భాగాలు వంటివి కూడా ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. వీటన్నింటినీ అతిధులకు అర్థమయ్యే విధంగా 26 ఇంట్రాక్టివ్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 16 భాషల్లో వాటిని తెలుసుకునే విధంగా ఏర్పాటు చేశారు.
వసుధైవ కుటుంబం, దాని కొనసాగుతున్న G20 ప్రెసిడెన్సీ కోసం భారతదేశం యొక్క థీమ్, ఇది పురాతన సంస్కృత గ్రంథం హితోపదేశ నుండి ఉద్భవించిన పదబంధం మరియు స్థూలంగా ‘భూమి మొత్తం ఒకే కుటుంబం’ అని అనువదిస్తుంది. న్యూఢిల్లీలో జరిగే G20 సమ్మిట్‌కు ఆతిథ్యం సందర్భంగా నిర్మించిన భారత్ మండపం రూపకల్పన వెనక కేంద్రం ఉద్దేశ్యమిదే.
మండపం ప్రాంగణంలో మొత్తం పదివేల చదరపు అడుగుల స్థలంలో వేరువేరు అంశాలపై ప్రదర్శనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. భారతీయ సంస్కృతి ఉట్టిపడే విధంగా.. యోగా, కుంభమేళా, డబుల్ ఇక్కత్ చేనేత వంటివి కూడా ఉన్నాయి. దేశం నలుమూలల నుంచి ఆయా ప్రాంతాల ప్రత్యేక కళలకు ఈ ప్రదర్శనలో చోటు కల్పించారు. రుగ్వేదానికి చెందిన రాతప్రతులను కూడా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. జి-20 దేశాధినేతల విడిదికి తాజ్ గ్రూప్ తో సహా శాంగ్రీల, మౌర్య, షెరటాన్, మెరీడియన్, ఒబెరాయ్ తదితర హోటళ్ళను ఎంపిక చేశారు. అక్కడ వారు భోజనాలు తినేందుకు ప్రత్యేకంగా వెండి, బంగారు పాత్రలు రూపొందించారు. సదస్సుకు వచ్చే దేశాధినేతల సతీమణుల కోసం ప్రత్యేకంగా చిరుధాన్యాలతో విందు ఏర్పాటు చేస్తారు.













