చైనాకు షాక్..
జీ20 వేదికగా చైనాకు మరో గట్టి షాక్ తగిలింది. చైనా ఆశల నడవాపై కూటమి దేశాలు నీళ్లు కుమ్మరించాయి. చరిత్రాత్మకమైన ‘ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరప్ ఎకనమిక్ కారిడార్’ను ప్రకటించాయి. ఇండియా నుంచి గల్ఫ్ దేశాల మీదుగా యూరప్ వరకూ రైల్వేలు, పోర్టులను అనుసంధానం చేసే ఈ ప్రాజెక్టుకు…. శనివారం జీ20 సమిట్ లో అమెరికా, ఇండియా, సౌదీ అరేబియా, యూఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ ఆమోదం తెలిపాయి. ఆసియా, అరేబియన్ గల్ఫ్, యూరప్ మధ్య వాణిజ్యాన్ని పరుగులుపెట్టించే లక్ష్యంతో ఈ దేశాలు ఎంవోయూపై సంతకాలు చేశాయి. చైనా తలపెట్టిన ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా జీ20 దేశాలు తెచ్చిన ఈ ప్రాజెక్టుతో ఇటు ఇండియాకు, అటు యూరప్ దేశాలకు పరస్పర ప్రయోజనం కలగనుంది.
ఇండియా–యూరప్ ఎకనమిక్ కారిడార్ ప్రాజెక్టును ఈస్ట్, నార్త్ అనే రెండు వేర్వేరు భాగాలుగా అమలు చేయనున్నారు. ఈస్ట్ కారిడార్ లో ఇండియా నుంచి వెస్ట్ ఆసియా(మిడిల్ ఈస్ట్)కు కనెక్టివిటీపై దృష్టిపెడతారు. రెండోదైన నార్తర్న్ కారిడార్ లో వెస్ట్ ఆసియా నుంచి యూరప్ దాకా కనెక్టివిటీకి ఏర్పాట్లు చేస్తారు. ప్రాజెక్టులో భాగంగా ఆయా దేశాల మధ్య రైల్వే నెట్ వర్క్ లను ఏర్పాటు చేస్తారు. దీంతోపాటు షిప్పింగ్ తోపాటు మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ రూట్లను విస్తరిస్తారు. ఎలక్ట్రిసిటీ కేబుల్స్, డిజిటల్ కనెక్టివిటీ, క్లీన్ హైడ్రోజన్ సరఫరా కోసం పైప్ లైన్లు కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంటాయి. ప్రాంతీయంగా సప్లై చైన్ లను మెరుగుపరిచి ఆయా దేశాల మధ్య వాణిజ్యం వేగవంతం చేస్తుంది. ఇండియా నుంచి యూరప్ కు ఏకంగా 40శాతం వేగంగా వాణిజ్యం జరుగుతుందని భావిస్తున్నారు.
బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది చైనా ప్రభుత్వం ….2013 లో చేపట్టిన ప్రపంచవ్యాప్త అభివృద్ధి వ్యూహం. ఆసియా, యూరప్, ఆఫ్రికాల్లోని దాదాపు 70 దేశాలు, అంతర్జాతీయ సంస్థల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడులు ఇందులో భాగంగా ఉన్నాయి. దాదాపు 140 దేశాల గుండా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించగా, తనతోపాటు దీనిలో పాలుపంచుకునే దేశాలకు కూడా లాభదాయకంగా ఉంటుందని చైనా ఆశపెట్టింది. కానీ ఈ సహాయంలో దయార్థ్రత లేదని పాకిస్థాన్, శ్రీలంక సహా జాంబియా, ఇథియోపియా, పపువా న్యూ గినియా వంటి దేశాలు అర్థం చేసుకుంటున్నాయి. చైనా ప్రయత్నాలను స్వాగతించడానికి బదులుగా వేరే ఏదైనా చేయాలని ఆలోచిస్తున్నాయి.
బీఆర్ఐలో చేరిన దేశాల్లో చాలా దేశాలు తాము చైనా ఇచ్చిన అప్పును తిరిగి తీర్చడం చాలా కష్టమని గుర్తించినట్లు ఓ అంతర్జాతీయ పత్రిక వెల్లడించింది. హంబంటోట పోర్ట్‌ను చైనాకు 99 సంవత్సరాలకు లీజుకు ఇవ్వడం తప్పేనని శ్రీలంక పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసింది. ప్రజాస్వామిక స్వేచ్ఛ, మానవ హక్కులు, పారదర్శకత వంటివాటిపై ప్రశ్నించడానికి వీల్లేని విధంగా చైనా వ్యవహరిస్తోందని పేర్కొంది.
మరోవైపు….చైనీస్ బీఆర్ఐలో భాగస్వాములయ్యేందుకు అంగీకరించిన 100కు పైగా దేశాలు చైనా వ్యవహార శైలి వల్ల తమ సార్వభౌమాధికారం దెబ్బతింటుందని భయపడుతున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన ఒప్పందాల్లో రుణాల వల, అసమానతలు చైనా ‘సహాయం’పై విపరీతమైన భయాందోళనకు కారణమవుతున్నట్లు తెలిపింది.













