జి-20 డిక్లరేషన్…
సంఘర్షణల కాలం కాదు, యుద్ధాల శకం కాదనే బలీయమైన పిలుపుతో జి20 ఢిల్లీ డిక్లరేషన్ వెలువడింది. ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు పిలుపుతో ఈ ప్రకటన సాగింది. పలు స్థాయిల్లో కసరత్తుల తరువాత సభ్య దేశాల ఏకాభిప్రాయ సాధనతో ఈ ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం పొంది, సభ్య దేశాలకు, ప్రపంచానికి ప్రాధాన్యాతాంశాలతో సందేశాలు వెలువరించింది. ప్రత్యేకించి ప్రాదేశిక భౌగోళిక సమగ్రతలు, ఆయా ప్రాంతాల సర్వసత్తాక విలువల పరిరక్షణ సిద్ధాంతాలను అన్ని దేశాలు తూచా తప్పకుండా పాటించాల్సి ఉందని జి20 సదస్సు ప్రకటన తెలిపింది.
ప్రపంచ దేశాలన్ని సమగ్రమైన, న్యాయయుత, సమంజసమైన శాశ్వత శాంతి ఉక్రెయిన్లో నెలకొనేలా చూడాల్సి ఉందని జి-20 సదస్సు పిలుపునిచ్చింది. అన్ని దేశాలు ఇందుకు తగు విధంగా చొరవ తీసుకోవల్సి ఉందని ఇండియా వేదికగా జి 20 సదస్సు ఎలుగెత్తి చాటింది. అన్ని దేశాలు తమకు తామే కాకుండా ఈ ప్రపంచాన్ని పరిరక్షించుకునేందుకు అంతర్జాతీయ చట్టాలకు, విశ్వజనీయ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని సూచించారు.
ఇంతకు ముందు బాలి జి 20 సమ్మిట్లో జరిగిన సంప్రదింపులను, కుదిరిన ఏకాభిప్రాయాలను ప్రస్తావించారు. అప్పటి విషయాలను పునరుద్ఘాటిస్తున్నామన్నారు. పలు అంతర్జాతీయ సమస్యల పట్ల యుఎన్ ఛార్టర్ సిద్ధాంతాలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంది. ఐరాస ప్రాదేశిక సూత్రాలను పాటించాల్సి ఉందని తెలిపారు. అంతర్జాతీయ విషయాలు సార్వత్రికమైనవి, వీటిపై పలు దశలలో భద్రతా మండలి, ఐరాస సర్వప్రతినిధి సభల సమావేశాలలో అన్ని దేశాలు తమ తమ వైఖరిని తెలియచేశాయి. ఇందుకు అనుగుణంగా తీర్మానాలు వెలువడ్డాయి. వీటికి కట్టుబడి వ్యవహరిస్తే ఘర్షణలకు తావు ఉండే ప్రసక్తే లేదని డిక్లరేషన్లో తెలిపారు.
ప్రపంచ ప్రజల భవిత ప్రపంచ స్థాయి ఆర్థికపరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో ఆర్థిక పరిస్థితులే ప్రపంచంలో ఆహారకొరత, అనారోగ్య సమస్యలు, అనూహ్యంగా తలెత్తే పలు రకాల వైరస్ ఇతరత్రా అనారోగ్య క్లిష్టతల దశల్లో తట్టుకునే శక్తిని ఆపాదిస్తాయి. దీనిని పరిగణనలోకి తీసుకోవల్సి ఉంది. యుద్ధం ఇతరత్రా ఘర్షణలతో గ్లోబర్ ఎకానమీకి కలిగే చేటును అన్ని దేశాలూ అర్ధం చేసుకోవల్సి ఉంటుంది. యుద్ధ సంక్లిష్టతలను నిర్మూలించే ఎటువంటి ప్రతిపాదనలను అయినా, చొరవలను అయినా ఈ సదస్సు ఆహ్వానిస్తుంది. దీనిని ఈ డిక్లరేషన్లో స్పష్టం చేస్తోందని తెలిపారు. ఐరాస నిర్ధేశిత విధివిధానాల పరిధిలో ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారం కుదుర్చుకోవల్సి ఉందని పేర్కొన్నారు.
37 పేజీల సుదీర్ఘ డిక్లరేషన్
ఢిల్లీ వేదికగా వెలువడ్డ జి 20 ఢిల్లీ డిక్లరేషన్లో అంశాల వారిగా పలు విషయాల ప్రస్తావన జరిగింది. వివిధ అంశాలతో 83 పేరాలతో మొత్తం 37 పేజీలతో డిక్లరేషన్ను వెలువరించారు. జి 20 అంతర్జాతీయ ఆర్థిక సహకారం దిశలో అత్యంత కీలకమైన వేదిక అని తెలిపారు. రాజకీయ భౌగోళిక, భద్రతా సమస్యల పరిష్కారానికి ఈ కూటమి అధీకృత వేదిక కాదని డిక్లరేషన్లో అంగీకరించారు. అయితే ఇప్పుడు తలెత్తుతున్న సంక్లిష్టతలు ప్రపంచ దేశాలకు తీవ్ర పరిణామాలను ఉత్పన్నం చేస్తాయని దీనిని గుర్తించే దిశలో డిక్లరేషన్ పిలుపు నిచ్చింది. ప్రకృతిపరమైన వైపరీత్యాలు, వైరస్ కారక ప్రపంచ స్థాయి అనారోగ్యాలు జటిలం అవుతున్న దశలో మానవ కల్పితంగా సమసిపోని రీతిలో తలెత్తే ఘర్షణలతో ఏ పక్షానికి సరైన న్యాయం దక్కదని, ఇటువంటి పరిస్థితి మన ఉనికిని మనమే దెబ్బతీసుకున్నట్లు అవుతుందని ఈ సమగ్ర ప్రకటనలో తెలిపారు.













