‘జి-20’ సంరంభం
దేశరాజధాని ఢిల్లీలో రెండురోజుల పాటు జి-20 సదస్సు జరుగుతోంది. ప్రపంచదేశాధినేతలందరూ తరలిరావడంతో.. ఈ సదస్సులో ఎలాంటి తీర్మానాలుంటాయి, ఏయే నిర్ణయాలు తీసుకుంటారన్న అంశంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. భారత్ తొలిసారిగా ఆతిథ్యమిస్తున్న ఈ సదస్సుపై భారీ అంచనాలే ఉన్నాయి. దక్షిణార్ధ గోళ దేశాల ఆందోళనలు, ఉక్రెయిన్ యుద్ధంతో నెలకొన్న దారుణ పరిస్థితులు, దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థలకు పరిష్కారం చూపుతూ భౌగోళికంగా ముక్కలైన రాజకీయ వాతావరణానికి చికిత్స చేసి సమ్మిళిత వృద్ధి దిశగా ప్రపంచాన్ని పరుగులు పెట్టించడంపై ఈ సదస్సు దృష్టి సారించనుంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తోపాటు ప్రపంచ సంస్థల అధినేతలు పాల్గొంటున్న ఈ సదస్సు పలు కీలక నిర్ణయాల దిశగా సాగనుంది. చైనా, రష్యా అమెరికాతో విభేదిస్తున్న వేళ సదస్సులో డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం కోసం భారత్ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది.ఈ సదస్సు ద్వారా మానవాళి కేంద్రంగా సమ్మిళిత అభివృద్ధికి కొత్త దారి వేస్తామని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. వసుధైక కుటుంబం పేరుతో ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు నినాదంగా భారత్ ఈ సదస్సును నిర్వహిస్తోంది.ఈ నినాదాన్ని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ ప్రశంసించారు. ఉపనిషత్తుల్లోని సారాంశం ఇదేనని వ్యాఖ్యానించారు.
ఇక ఈ సదస్సులో అత్యంత కీలకాంశాల్ని చర్చించనున్నారు. మరీ ముఖ్యంగా ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో సభ్యత్వం కల్పించడంపై కీలక చర్చ జరగనుంది. అయితే దీనికి చైనా , యూరప్ దేశాలు సానుకూలంగా ఉండడంతో.. అనుకూల నిర్ణయం వెలువడే అవకాశముంది. ఇక.. అంతర్జాతీయ రుణవితర పునర్ వ్యవస్థీకరణపైనా చర్చ జరిగే అవకాశముంది. దీనిలో భాగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణవితరణ పెంచాలన్న ప్రతిపాదనపైనా చర్చించనున్నారు. ఇక రోజురోజుకూ బలోపేతమవుతున్న క్రిప్టో కరెన్సీకి నియంత్రణ లేకపోవడంతో.. సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. దీని నియంత్రణ వ్యవస్థ ఏర్పాటుపైనా చర్చించే అవకాశముంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్రపై మిశ్రమ స్పందన లభిస్తోంది.అయితే దాన్ని వ్యతిరేకించే బదులు.. ప్రయోజనకరంగా వాడుకుంటే ప్రపంచానికి మంచిదన్నది ప్రధాని మోడీ భావన. దీనిపైనా చర్చ జరుగుతుందని భావిస్తున్నారు.
ఇందులో ఆతిథ్య దేశం హోదాలో భారత్.. కొన్ని ప్రతిపాదనలు చేయనుంది. ముఖ్యంగా సమ్మిళిత వృద్ధి అవసరాన్ని నొక్కి చెప్పనుంది. డిజిటల్ ఆవిష్కరణలు, వాతావరణ మార్పులు, అందరికీ సమాన ఆరోగ్య అవకాశం తదితర అంశాలపైప్రతిపాదనలు పెట్టనుంది.
కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా వలయంలోకి ఢిల్లీ చేరుకుంది. ఆకాశ మార్గంలో యాంటీ డ్రోన్ వ్యవస్థతో గస్తీ నిర్వహిస్తున్నారు. 50వేల మందికిపైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. ప్రగతి మైదాన్ చుట్టూ సుమారు 13 వేల మందితో భద్రత కల్పించారు.













