జయహో ‘భారత్’..
అంతర్జాతీయంగా భారతదేశం ప్రాభవం గణనీయంగా పెరుగుతోంది. మొన్నటివరకూ ఓ స్వతంత్రదేశంగా భాసిల్లిన భారత్.. ఇప్పుడు అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతోంది. దీనికి జి20 సమావేశాలు ఓ చక్కని ఉదాహరణగా మారాయి. ప్రపంచ దేశాధినేతలు ఢిల్లీ జి20 సదస్సుకు హాజరుకావడమే కాదు.. భారత్ అభివృద్ధి ఆకాంక్షలను గుర్తించారు. అగ్రరాజ్యాధినేత బిడెన్ భారత్ కు మద్దతుగా నిలవగా..యూరోపియన్ యూనియన్ సైతం అండదండగా నిలబడింది. అంటే ప్రపంచంలో శక్తిమంతమైన దేశాలు.. భారత నాయకత్వాన్ని స్వాగతించినట్లు అర్థమవుతోంది.
సమావేశాల తొలిరోజే భారత్.. అద్భుత విజయాన్ని సాధించింది. ఎప్పుడెప్పుడా అని ఆఫ్రికన్ దేశాలు ఎదురుచూస్తున్న శుభవార్తను.. తొలి రోజే అందించింది. 55 దేశాల ఆఫ్రికన్ యూనియన్ సభ్యత్వానికి ఆమోద ముద్ర వేయించడంలో సఫలీకృతమైంది. ఈ విషయంలో భారత్.. తొలినుంచి స్పష్టమైన కార్యాచరణ అమలు చేసింది. ఓవైపు ఆతిథ్యదేశం హోదాలో సంబంధిత దేశంతో భారత్ మాట్లాడుతూనే.. ఎక్కడెక్కడ అడ్డంకులు ఎదురవుతాయని భావించిందో ఆదేశాలకు.. ఆఫ్రికన్ యూనియన్ తరపున అభ్యర్థనలు చేయించింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయాదేశాలు.. ఏయూ సభ్యత్వానికి అంగీకరించాయి. ఇది భారత్ దౌత్య సత్తా, నీతికి నిదర్శనమని జర్మనీ ప్రతినిధులు ప్రశంసించారు.
ఉక్రెయిన్ యుద్ధం విషయానికి సంబంధించిన అంశాల విషయంలో ఏకాభిప్రాయం సాధించడంలో జి-20 సఫలమైంది. బాలి జి20 సదస్సులో కొన్ని తీర్మానాలకు అంగీకరించిన చైనా, రష్యా.. ఈసమావేశాల విషయంలో వాటిని తిరస్కరించాయి. దీంతో వాటిని నొప్పించకుండాానే.. పశ్చిమదేశాలను మెప్పిస్తూ.. అద్భుతంగా తీర్మానాన్ని ప్రకటించింది.
ఆర్థిక నడవా కారిడార్ ప్రకటించి చైనాకు షాకిచ్చింది. దీంతో చైనా కారిడార్ పరిస్థితి అగమ్యగోచరం కానుంది. ఇండియా ప్రకటించిన కారిడార్.. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారనుండడం..చైనా బెల్ట్ కారిడార్ కు పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. భారత్ .. అన్ని దేశాలను కలుపుకుని ముందుకెళ్లగలమని సదస్సు సందర్భంగా గట్టిగా చాటిందని చెప్పొచ్చు. దీంతో ఆఫ్రికన్ దేశాలు సహా పలు పాశ్చాత్యదేశాలు కూడా భారత నాయకత్వాన్నికోరుకుంటున్నాయి.













