‘చారిత్రక’ క్షణాలు..
ఢిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సులో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. భారత్ మండపంలో జరిగిన వన్ ఎర్త్ సెషన్ ప్రారంభోపన్యాసంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయాన్ని ప్రతిపాదించారు. అందరు సభ్యుల అంగీకారంతో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆఫ్రికన్ యూనియన్ అధినేతను శాశ్వత సభ్యులకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు.
ప్రస్తుతం 21వ శతాబ్దంలో ప్రపంచానికి కొత్త దిశ, దశ సూచించడానికి ఇదే కీలక సమయం. పాత సవాళ్లు ఇప్పుడు కొత్త సమాధానాలు కోరుతున్నాయి. అందుకనే మనం హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్‌తో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోడీ. కొవిడ్ 19 సంక్షోభం తర్వాత ప్రపంచంలో విశ్వాస రాహిత్యం ఏర్పడింది. యుద్ధం ఈ అపనమ్మకాన్ని మరింత పెంచింది. కొవిడ్‌ను ఓడించిన మనం ఈ విశ్వాస రాహిత్యంపై కూడా విజయం సాధించవచ్చు. మనందరం కలిసి ప్రపంచంలో నెలకొన్న అపనమ్మకాన్ని పారదోలుదాము. ఈ క్రమంలో సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ మంత్రం మనకు మార్గదర్శిగా ఉంటుందన్నారు మోడీ. ప్రపంచంలో పేద, సంపన్న దేశాల మధ్య భేదాలు, ఆహారం, ఇంధనం నిర్వహణ, హెల్త్, ఎనర్జీ, నీటి భద్రత వంటి సమస్యలకు సమాధానం కోసం ముందుకు వెళ్లాల్సిందే. భారత్ జీ20 అధ్యక్షతన దేశం లోపల, బయట అందరిని కలుపుకొని పోవడానికి ప్రతీకగా నిలిచింది. ఇది ప్రజల జీ20 అనడానికి నిదర్శనంగా మారిందన్నారు మోడీ.
అంతర్జాతీయ వేదికలమీద దక్షిణాది దేశాలకు ప్రాతినిధ్యం అసలే తక్కువగా ఉంటే, ఆఫ్రికన్ దేశాలు ఈ విషయంలో మరింత చిన్నచూపుకు గురవుతున్నాయన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో జి20లో ఆదేశాలకు సభ్యత్వం రావడం.. ఓరకంగా మంచి పరిణామం. దీనికితోడు.. ఆయా దేశాలతో భారతదేశానికి ఉన్న మైత్రి మరింత పటిష్టమవుతుంది. కరోనాకాలంలో ఆఫ్రికన్ దేశాల పక్షాన నిలవడంతో పాటు చాలా దేశాల్లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ఊతమిస్తూ భారత్ ఇప్పటికే వాటికి చేరువగా ఉన్నది.
ప్రపంచానికి సమస్యలుగా పరిణమించిన పర్యావరణం, పట్టణీకరణ, వలసలు, ఉత్పాతాలు, ఉపద్రవాలు, మహమ్మారుల వంటి కీలకమైన అంశాల్లో ఆఫ్రికాఖండానికి ప్రాతినిథ్యం లేకుండా చర్చలు, నిర్ణయాలు జరగడం సముచితం కాదు. గతంలో మాదిరిగా ఆఫ్రికా …చీకటిఖండంగా కాక, చాలారంగాల్లో అభివృద్ధిసాధిస్తోంది. అనేక ఆఫ్రికన్ దేశాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. 2016లో చైనా తన అధ్యక్షతన ఆఫ్రికన్ దేశాల్లో జి20 పారిశ్రామికీకరణకు దోహదం చేసే నిర్ణయాలు కొన్ని తీసుకున్నది. ఇప్పుడు భారతదేశం తన అధ్యక్షతన జరుగుతున్న జీ20లో ఆఫ్రికన్ యూనియన్ ను భాగస్వామిగా చేయడం ఓ విజయంగానే చెప్పొచ్చు.













