హింసాగ్నిలో ఫ్రాన్స్ విలవిల..
నహేల్ అనే టీనేజర్ పోలీసు కాల్పుల్లో మృతి చెందడం ఫ్రాన్స్ ను అగ్నిగుండంలా మార్చింది. ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు ప్రయత్నించడం.. పరిస్థితిని మరింత దిగజార్చింది. భద్రతాదళాల తీరుతో రెచ్చిపోయిన ఆందోళనకారులు.. వీధుల్లో హింసాగ్ని కొనసాగిస్తున్నారు. కనిపించిన వాహనాలకల్లా నిప్పంటిస్తున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు.నాలుగు రోజులుగా ఫ్రాన్స్ లో హింసాగ్ని తీవ్రరూపు దాల్చింది.
ఆందోళనలు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్.. యూరప్ టూర్ అర్థాంతరంగా ముగించి, స్వదేశానికి చేరారు. దేశంలో శాంతిభద్రతల పరిస్థితిపై అత్యవసర సమావేశం నిర్వహించారు. యువత హింసాత్మక ఘటనలకు దూరంగా ఉండాలని సూచించారు. మరోవైపు హింస ఆగకపోవడంతో దేశంలోని పలుప్రాంతాల్లో 45 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. కొన్ని తేలికపాటి సాయుధ వాహనాలను రంగంలోకి దించింది ప్రభుత్వం. ఇప్పటివరకు 1,100 అరెస్టులు చోటుచేసుకున్నాయని ఫ్రాన్స్ ఇంటీరియర్ మినిస్టర్ గెరాల్డ్ డార్మానిన్ వెల్లడించారు.
మరోవైపు…సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించాలంటూ అధికారులకు మేక్రాన్ సూచించారు. భావోద్వేగాలను రెచ్చగొట్టే సమాచారాన్ని తొలగించే విషయమై ఆయా సంస్థలతో కలిసి తమ ప్రభుత్వం పనిచేస్తుందని మేక్రాన్ తెలిపారు. హింసను ఎగదోసేందుకు సోషల్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకునేవారిని గుర్తించేందుకూ ప్రయత్నిస్తామన్నారు. గురువారం రాత్రి అరెస్టు అయిన ఆందోళనకారుల్లో ఎక్కువమంది యువతే ఉన్నారని, వారిలో కొంతమంది మరీ చిన్నవారని, ఈ నేపథ్యంలో అటువంటివారిని గడప దాటకుండా చూసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులదేనని మేక్రాన్ స్పష్టం చేశారు.
మరోవైపు….ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న మేక్రాన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆందోళనల సమయంలో ఆయన మ్యూజిక్ కన్సర్ట్ లో పాల్గొనడమే అందుకు కారణం. ఆ కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పారిస్‌లో బ్రిటిష్ సింగర్ ఎల్టాన్ జాన్ కన్సర్ట్కు మేక్రాన్, ఆయన సతీమణి ఇటీవల హాజరయ్యారు. ఆ వీడియోలు చూసి నెటిజన్లు మేక్రాన్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ‘‘ఆందోళనకారులు ఫ్రాన్స్ నగరాల్లో విధ్వంసం సృష్టిస్తుంటే.. మేక్రాన్ మ్యూజిక్ కన్సర్ట్‌లో ఉన్నారు. అక్కడ ఉత్సాహంగా సతీమణితో కలిసి కాలు కదిపారు’’ అంటూ మండిపడుతున్నారు.. నిజానికి ఆ ఈవెంట్ బుధవారం జరిగింది. అప్పటికి ఘర్షణలు ఉద్ధృతంగా లేవు. కానీ ఈ వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.













