స్వదేశానికి నవాజ్..
స్వదేశానికి చేరుకోవాలన్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్.. కల ఫలించింది. నాలుగేళ్ల నుంచి స్వీయ ప్రవాసంలో గడిపిన నవాజ్ షరీఫ్.. ఎట్టకేలకు పాక్ చేరుకున్నారు.’ఉమీద్-ఇ-పాకిస్థాన్’ చార్టెర్డ్ విమానంలో ఇస్లామాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు మాజీ న్యాయశాఖ మంత్రి సెనెటర్ అజామమ్ తరార్, పార్టీ నేతలు, నవాజ్ లీగల్ టీమ్ సాదర స్వాగతం పలికారు. న్యూ ఇస్లామాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని స్టేట్ లాంజ్‌లో కొద్దిసేపు విశ్రాంతి అనంతరం ఆయన లాహోర్ చేరుకున్నారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో నవాజ్ ప్రసంగించారు.
నాలుగేళ్ల తర్వాత పాకిస్తాన్ తిరిగి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు నవాజ్. పాకిస్థాన్ వదిలి వచ్చినప్పుడు, విదేశాలకు వెళ్లినప్పుడు తనకు ఎలాంటి ఆనందం కలగలేదని, తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమ హయాంలో పాక్ పరిస్థితిని ఇప్పటి పరిస్థితితో పోల్చుకుంటే బాధాకరంగా ఉందన్నారు. ఐఎంఎఫ్‌కు గుడ్‌బై చెప్పామని, విద్యుత్ చాలా చవకగా ఇచ్చేవాళ్లమని, రూపాయి విలువ నిలకడగా ఉందని, ఉద్యోగాల కల్పన ఉండేదని, ఒక రొట్టి రూ.4కే దొరికేదని, పేద కుటుంబంలోని పిల్లలు సైతం స్కూళ్లకు వెళ్లేవారని, మందులు కూడా చాలా చవగానే దొరికేవని అన్నారు.
పీటీఐ ధ్వజం
నవాజ్ రాకపై ప్రస్తుతం జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) విమర్శలు గుప్పించింది. న్యాయ ఆశ్రయంతో తప్పించుకుని తిరుగుతున్న పిరికివాడు తిరిగి వస్తున్నారంటూ ధ్వజమెత్తింది. నేషనల్ క్రిమినల్ తిరిగిరావడం సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయమని పేర్కొంది. వచ్చే ఏడాది జనవవరిలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సిన తరుణంలో నవాజ్ స్వదేశానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఆయన పార్టీ ప్రచారం చేపట్టేందుకు అనేక చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు కూడా బలంగానే ఉన్నాయి. రెండు కేసుల్లో నవాజ్ షరీఫ్ దాఖలు చేసిన పిటిషన్‌పై పాకిస్థాన్ యాంటీ కరెప్షన్ ఏజెన్సీ.. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో ఇస్లామాబాద్ హైకోర్టు ఆయనకు అక్టోబర్ 24 వరకూ ప్రొటక్టివ్ బెయిల్ ఇచ్చింది.
మూడుసార్లు పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వాజ్ షరీఫ్ అవినీతి కేసుల్లో జైలు పాలయ్యారు. అనారోగ్య కారణాలపై 2019 నవంబర్‌లో జైలు నుంచి విడుదలయ్యారు. 2019లో వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు లాహోర్ హైకోర్టు నాలుగు వారాల పాటు అనుమతి మంజూరు చేసింది. దీనికి ముందు అల్-అజిజియా మిల్స్ కేసులో లాహోర్‌లోని కోట్ లఖ్‌పట్ జైలులో శిక్ష అనుభవించారు. లండన్‌లో ప్రవాసంలో గడిపిన నవాజ్‌ను పరారీలో ఉన్న వ్యక్తిగా 2020లో పాక్ ప్రకటించింది. నాలుగేళ్ల తర్వాత ఆయన పాక్‌కు తిరిగి రావడంతో కొత్త సమస్యలను ఆయన ఎదుర్కోవలసి రావచ్చు. రాజకీయాల్లో పునఃప్రవేశం విషయంలోనూ చిక్కులు తలెత్తే అవకాశాలున్నాయి.













