బీజేపీ మరోసారి విఫల ప్రయోగం చేస్తోందా..!?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ బలహీన పడడం బీజేపీకి బాగా కలిసొచ్చింది. మోదీ చరిష్మా.. అవినీతిరహిత పాలన.. లాంటి అనేక అంశాలే అజెండాగా బీజేపీ దూసుకెళ్తోంది. అయితే అప్పుడప్పుడూ ఆ పార్టీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. తాజాగా కమలం పెద్దలు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రివాల్ కు తిరుగులేకుండా పోయింది. పార్టీ స్థాపించిన మొదటిసారే చీపురు పట్టి ఢిల్లీకి పట్టిన చెత్తనంతా ఊడ్చిపారేశారాయన. ఆయనది బలుపు కాదు.. వాపు మాత్రమే.. వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోరంగా ఓడిపోవడం ఖాయమని… మోదీ హవా ముందు తట్టుకోవడం కష్టమని ఎంతోమంది జోస్యం చెప్పారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రెండోసారి అంతకుమించిన మెజారిటీతో విజయం సాధించారు. రెండో దఫా అరవింద్ కేజ్రివాల్ ను ఎదుర్కొనేందుకు బీజేపీ ప్రయోగించిన అస్త్రం కిరణ్ బేడీ. ఆమెను బరిలోకి దింపితే ఢిల్లీలో తిరుగుండదనుకున్నారు. కానీ బీజేపీ అంచనాలు ఏమాత్రం వర్కవుట్ కాలేదు.
ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహిన పడిందని భావించిన బీజేపీ.. గత ఎన్నికల ముందు పరిపూర్ణానంద స్వామీజీని తెరపైకి తీసుకొచ్చింది. స్వామీజీకి పబ్లిక్ లో మంచి క్రేజ్ ఉండడంతో ఉత్తర ప్రదేశ్ లో యోగి లాగా తెలంగాణలో కూడా తమకు తిరుగుండదని కమలం పెద్దలు భావించారు. ఆయనే తమ సీఎం అభ్యర్థి అనే రేంజ్ లో ప్రచారం చేశారు. కానీ ఆ ఎన్నికల్లో స్వామీజీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. బీజేపీ ప్లాన్ మరోసారి తిరగబడింది. ఆ తర్వాత పరిపూర్ణానంద స్వామీజీ కనిపించకుండా పోయారు.
తాజాగా కేరళలో ఇలాంటి ప్రయోగమే చేస్తోంది బీజేపీ. మెట్రో మ్యాన్ గా ప్రసిద్ధి చెందిన శ్రీధరన్ ను తెరపైకి తెచ్చింది. దేశంలో మెట్రో పితామహుడిగా పేరొందారు శ్రీధరన్. ఆయనకు కేరళలోనే కాదు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. తమకు కొరకరాని కొయ్యగా మారిన కేరళలో ఆయన్ను ముందు నెలబెడితే కాస్తో కూస్తో ప్రభావం చూపడం ఖాయమని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. అయితే కమలం నేతల అంచనాలు తలకిందులయ్యే ప్రమాదముందని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. అక్కడ లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలను కాదని బీజేపీకి ఓట్లేసే పరిస్థితి లేదని చెప్తున్నాయి. అక్కడ బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కకపోవచ్చనేది ప్రీపోల్స్ అంచనా.
ఇక తిరుపతి సీటు విషయానికొద్దాం. ఇక్కడ బీజేపీ రత్నప్రభను తమ అభ్యర్థిగా ఖరారు చేసింది. రత్నప్రభ కర్నాటక కేడర్ ఐఏఎస్ అధికారి. తెలుగు వ్యక్తే అయినా ఆమెకు కర్నాటకతోనే అనుబంధం ఎక్కువ. ఇక్కడ సీటు కోసం మరో ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు.. ఎన్నో నెలలుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. తిరుపతిలోనే ఉంటూ క్షేత్రస్థాయి పరిచయాలు పెంచుకుంటున్నారు. కానీ దాసరి శ్రీనివాసులను కాదని బీజేపీ రత్నప్రభ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గుచూపింది. క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తున్నవాళ్లంతా బీజేపీ మరో విఫల ప్రయోగం చేస్తోందని భావిస్తున్నారు.













