‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ వివాదం…
వన్ నేషన్, వన్ ఎలక్షన్ కమిటీ ఈ నెల 23న అధికారికంగా మొదటిసారి సమావేశం కానుంది. కమిటీ చైర్మన్, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఎనిమిది మంది సభ్యుల అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. లోక్‌సభతో పాటు అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించే అంశంపై వీలైనంత త్వరగా పరిశీలించి సిఫారసులు చేయడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కేంద్రహోం మంత్రి అమిత్ షా, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్, గులాం నబీ ఆజాద్, ఎన్కే సింగ్, హరీశ్ సాల్వే, సుభాష్ కశ్యప్, సంజయ్ కొఠారీ సభ్యులుగా ఉన్నారు. కేంద్ర సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఒకేసారి ఎన్నికల నిర్వహణ అంశంపై ఈ కమిటీ చట్టాలను పరిశీలించి రాజ్యాంగ, చట్ట సవరణలకు నిర్దిష్ట సిఫారసులు చేయనుంది. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని, వినతులను స్వీకరించనుంది.
అయితే జమిలీని ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాజకీయ, ఆర్థిక, జాతీయ భద్రతా అంశాల్లో ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆరోపించింది. రాజ్యాంగం, సమాఖ్య వ్యవస్థ సవాళ్లు ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ మిత్రులకు అప్పగిస్తూ క్రోనీ- క్యాపిటలిజానికి పాల్పడున్నారని ఆక్షేపించింది. ఒకే దేశం- ఒకే ఎన్నికల ప్రతిపాదనను తిరస్కరించిన సీడబ్ల్యూసీ.. మహిళా రిజర్వేషన్లు, కుల గణన చేపట్టాలని తీర్మానించింది.
బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చే ‘ఒకే దేశం… ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనను వ్యతిరేకించాలని ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. ఎంపీలను ఆదేశించారు. లోక్‌సభ, రాజ్యసభ సమావేశాల్లో పార్టీ ఎంపీలు అనుసరించాల్సిన తీరుపై సమగ్రంగా చర్చించారు. రాజ్యసభలో బీజేపీకి తగిన మద్దతు లేదు కనుక జమిలీ ఎన్నికల ప్రతిపాదనను… ఇండియా కూటమి ఎంపీలు కలిసికట్టుగా వీగిపోయేలా చూడాలని సూచించారు. అదే విధంగా బీజేపీ తీసుకొచ్చిన నీట్ కారణంగా రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు అధికమైన విషయాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. అలాగే నీట్ నుంచి రాష్ట్రాన్ని మినహాయించే బిల్లును రాష్ట్రపతి త్వరలో ఆమోదించేలా బీజేపీ పాలకులపై ఒత్తిడి చేయాలని దిశానిర్దేశం చేశారు.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహణ అనేది దేశానికి లాభదాయకమైనప్పటికీ.. దీన్ని రాజకీయకోణంలో చూడడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. ముఖ్యంగా ఏకాభిప్రాయంతో తీసుకురావాల్సిన బిల్లును.. కేంద్రం ఒంటెత్తు పోకడలతో చిక్కుల్లోకి నెడుతోంది. దీంతో విపక్ష ఇండియా కూటమి వ్యతిరేకించడమే కాదు… పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈబిల్లు కార్యరూపం దాల్చడం అనుమానంగానే ఉంది.













