టార్గెట్ కేజ్రీవాల్..
కాంగ్రెస్ ముక్త భారత్ దిశగా బీజేపీ దూసుకెళ్తోంది. ఇప్పటికే 20కి పైగా రాష్ట్రాల్లో పాగా వేసి, తమ వ్యూహ చతురతతో ప్రతిపక్షాలకు చుక్కలు చూపిస్తున్నారు మోడీ, అమిత్ షా. అలాంటి మోడీ-షా ద్వయానికి పదిహేనేళ్లుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు ఆప్ అధినేత కేజ్రీవాల్. ఏదో అలా అన్నట్లుగా ప్రారంభమైన ఆప్.. ఇప్పుడు రెండు రాష్ట్రాలను తమ గుప్పిట్లోకి తీసుకుంది. పంజాబ్, హర్యానా తర్వాత ఉత్తరాదిపై కేజ్రీవాల్ ఫోకస్ పెట్టారు. మోడీ లాంటి గండరగండడు, రాజకీయ యోధుడిని.. అవలీలగా ఎదుర్కొంటున్నారు కేజ్రీవాల్. దీంతో కేజ్రీవాల్ కు చెక్ చెప్పడానికి మోడీ-షా ద్వయం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ఇలాంటి సమయంలో వీరికి ఢిల్లీ లిక్కర్ స్కామ్.. చక్కటి అవకాశంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆరోగ్యమంత్రి సత్యేంద్రజైన్ సహా పలువురిని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. అయినా.. కేజ్రీవాల్ ఏమాత్రం తగ్గడం లేదు. బీజేపీ ముక్త భారత్ అంటూ నినదిస్తున్నారు. దీంతో మరోసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణ వేగవంతమైంది. తెలంగాణ ఎమ్మెల్సీ కవితకు నోటీసులిచ్చిన సీబీఐ.. ఈ కేసులో దూకుడు పెంచినట్లు సంకేతాలిచ్చింది. సీబీఐ, ఈడీ నోటీసులు ఇస్తున్నా ఇటు కవిత, అటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించడం లేదు. దీంతో ఈసారి ఇద్దరినీ ఒకేసారి టార్గెట్ చేయాలని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.
ఢిల్లీ సీఎంపై సీబీఐ స్కాం పాలసీ మార్పు, క్విడ్ ప్రోకో వంటి అంశాలపై కేసు నమోదు చేసింది. ఇందులో మాగుంట రాఘవరెడ్డి కీలక అంశాలు వెల్లడించారు. కేజ్రీవాల్‌కు, ఆమ్ఆద్మీ పార్టీకి డబ్బులు ఎలా ఇచ్చారు అని తెలిపారు. ఈ వ్యవహారంలో కవితే కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. దీంతో ఈ స్టేట్మెంట్ ఆధారంగా ఇటు కేజ్రీవాల్, అటు కవితను విచారణ చేస్తారని తెలుస్తోంది. కవిత భుజంపై తుపాకీ పెట్టి కేజ్రీవాల్‌ను షూట్ చేయడమే లక్ష్యంగా తాజా నోటీసులు అని ప్రచారం జరుగుతోంది. కవిత విచారణ తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంటుందని తెలుస్తోంది.
అయితే కేజ్రీవాల్ మాత్రం.. తనకు నోటీసులిచ్చే అధికారం సీబీఐ, ఈడీలకు లేదంటున్నారు. ఈ రెండు సంస్థలు మోడీ సర్కార్ ఆదేశాలతో తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. అదే పరిస్థితి ఎదురైతే ఏం చేయాలన్న అంశంపైనా… ఆయన సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. కానీ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం అంత సులభంగా జరుగుతుందా అన్నది చర్చనీయాంశమే..













