రేపే ఎన్నికల షెడ్యూల్..! ఉత్కంఠకు తెరదింపిన ఈసీ..!!
దేశవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం నెలకొంది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా.. ఫలితాలు ఎప్పుడొస్తాయా.. ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది.. లాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు దేశప్రజల్లో ఉన్నాయి. వీటన్నిటికీ ఎన్నికల కమిషన్ దగ్గర మాత్రమే సమాధానాలున్నాయి. షెడ్యూల్ విడుదలైతే పార్టీలు, ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు షెడ్యూల్ విడుదలపై ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన చేసింది. రేపు అంటే శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలకు షెడ్యూల్ విడుదల చేయబోతున్నట్టు వెల్లడించింది.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. జూన్ లోపు కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంది. ఆలోపు ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తి కావాల్సి ఉంది. ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరిగితే జూన్ లోపు తతంగమంతా పూర్తవుతుంది. 2019లో మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 7 దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ పూర్తయింది. మే 23న ఫలితాలు వెల్లడయ్యాయి. మే 28న కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువుదీరింది.
లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఈసీ షెడ్యూల్ విడుదల చేయనుంది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా షెడ్యూల్ విడుదల కానుంది. గతంలో మొదటి విడతలోనే ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యాయి. దాదాపు నెల రోజులపాటు ఫలితాలకోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అవుతుందనే టాక్ నడుస్తోంది. మొత్తానికి రేపు మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచే కోడ్ అమల్లోకి రానుంది.













