శరద్ పవార్ కు పరీక్షా సమయం…?
మరాఠా రాజకీయ దురంధరుడు శరద్ పవార్ కు గట్టి షాక్ తగిలింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు అబ్బాయ్ అజిత్ పవార్ కు దక్కాయి. అజిత్ పవార్ ఆధ్వర్యంలోనిదే అసలైన ఎన్సీపీ అని మంగళవారం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల గుర్తు అయిన ‘గోడ గడియారం’ కూడా ఆ పార్టీకే చెందుతుందని తెలిపింది. కొన్ని నెలలుగా బాబాయ్, అబ్బాయ్ మధ్య సాగుతున్న పొలిటికల్ సమరంలో అబ్బాయ్ అజిత్ విజేతగా ఆవిర్భవించాడు.
అసలైన ఎన్సీపీ ఎవరిదో తేల్చడానికి పలు రకాల పరీక్షలు నిర్వహించినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. పార్టీ లక్ష్యాలు, ఆశయాల పరీక్ష, పార్టీ రాజ్యాంగం, నియమ నిబంధనల పరీక్ష, చట్టసభలు, పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ఆధిక్యత పరీక్ష నిర్వహించినట్టు పేర్కొంది. రెండు గ్రూపులు కూడా పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం లేదని తెలిపింది. అందువల్ల చట్టసభల్లో ఆధిక్యత ప్రక్రియను ప్రామాణికంగా తీసుకున్నట్టు పేర్కొంది. చట్టసభల్లో అజిత్ వర్గానికే ఆధిక్యం ఉన్నందున దాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తిస్తున్నట్టు వెల్లడించింది.
‘వన్ టైం ఆప్షన్’ కింద శరద్ పవార్ వర్గానికి ఎన్నికల కమిషన్ కాస్త వెసులుబాటు కల్పించిది. రాజ్యసభ ఎన్నిలను దృష్టిలో పెట్టుకొని బుధవారం మధ్యాహ్నంలోగానే పార్టీకి కొత్త పేరును ప్రతిపాదించాలని సూచించింది. మూడు పేర్లను ప్రతిపాదించవచ్చని తెలిపింది. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వినమ్రతతో స్వీకరిస్తున్నట్టు అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. శరద్ పవార్ వర్గం మాత్రం ఇది దురదృష్టకర నిర్ణయమని అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ఎన్సీపీని శరద్ పవార్ స్థాపించారని అందరికీ తెలుసు. ప్రారంభం నుంచి ఆయనే జాతీయ అధ్యక్షునిగా ఉన్నారని కూడా తెలుసు. అయితే పై నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందన్నారు మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్.













