సమదూరమే.. కానీ..?
ఖలిస్థానీ నేత నిజ్జర్ హత్యోదంతంలో అమెరికా మద్దతు మాకే అని కెనడా బహిరంగంగా చెబుతోంది. భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తో సమావేశంలో ఈ విషయాన్ని తప్పక చర్చిస్తామని అమెరికా విదేశాంగమంత్రి బ్లింకెన్ చెప్పారన్నారు కెనడా ప్రధాని ట్రూడో. మరోవైపు… అమెరికా అధికారులు సైతం భారత్ పై ఒత్తిడి పెంచుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. అయితే అంతర్గతంగా ఇది జరుగుతున్నట్లు తెలుస్తోంది.
నిజ్జర్ హత్య విషయంలో ఓ పక్క అమెరికా మద్దతు మాకే అని కెనడా చెబుతున్నా.. ఆ విషయంపై బహిరంగంగా మాట్లాడేందుకు వాషింగ్టన్ ఇష్టపడటంలేదు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో భేటీ అయిన అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్… ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక అంశాలపై చర్చించారు. విస్తృత స్థాయి అంశాలు, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించాం. త్వరలో జరగబోయే 2+2 భేటీకి సంబంధించిన అంశాలపై చర్చించాం’’ అని ఎక్స్ లో జై శంకర్ తెలిపారు.
భారత్-అమెరికా విదేశాంగ మంత్రులు.. నిజ్జర్ వ్యవహారంపై గుంభనంగా వ్యవహరించారు. ఈ విషయం చర్చకు వచ్చిందా.. రాలేదా అనే విషయం కూడా వెల్లడించలేదు. దీనిపై అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు అమెరికా మంత్రి ఆంటోనీ బ్లింకెన్ నిరాకరించారు. ‘‘నా మిత్రుడు, సహచరుడు జైశంకర్ను విదేశాంగశాఖ ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించడం సంతోషంగా ఉంది. జీ20, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వంటి చాలా అంశాలపై చర్చలు జరిగాయి’’ అని వెల్లడించారు. స్టేట్ డిపార్ట్మెంట్ ట్రీటీ రూమ్లో జరిగిన ఫొటో సెషన్లో ఇరు దేశాల మంత్రులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. జీ20 సదస్సుకు సహకరించినందుకు అమెరికాకు ధన్యవాదాలు తెలిపారు జైశంకర్.
అంతకు మందు జైశంకర్ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్ సలీవాన్తో శ్వేత సౌధంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల బంధాన్ని ముందుకు తీసుకెళ్లడంపై చర్చించినట్లు జైశంకర్ ట్విటర్లో తెలిపారు. ఈ వ్యవహారం అగ్రరాజ్యానికి .., దౌత్యపరంగా సంక్లిష్టతను తెచ్చింది. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న అమెరికా… సైలెంట్ గా పని చక్కబెడుతున్నట్లు కనిపిస్తోంది. ఓవైపు కెనడా ప్రతినిధులతో మాట్లాడుతూనే, మరోవైపు భారత్ కు సహకరించాలని సూచిస్తోంది.













