మరికాసేపట్లో ట్రంప్, హారిస్ ఫస్ట్ బిగ్ డిబేట్…
అమెరికా కాబోయే ప్రెసిడెంట్ ఎవరు..? మాజీ అధ్యక్షుడు ట్రంప్ కే జనం పట్టం గడతారా..? ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న కమలా హారిస్ ను గద్దెనెక్కిస్తారా..? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. బైడన్ స్థానంలో డెమొక్రాటిక్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థిగా రంగ ప్రవేశం చేసిన హారిస్.. ప్రచారంలో సత్తా చూపిస్తున్నారు.మాజీ అధ్యక్షుల నుంచి సీనియర్ నాయకుల వరకూ అందరినీ రంగంలోకి దించి ప్రచార పర్వాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఇటు ట్రంప్ మాత్రం .. కేవలం తన చరిష్మానే నమ్ముకున్నారు. తన వాగ్దాటి, అమెరికా రక్షణకు తాను మాత్రం సరైన అభ్యర్థిని అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. దీంతో ఈ ఇద్దరు అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లు ప్రచారంలో పోటీ పడుతున్నారు.
దీనిలో భాగంగా మరికాసేపట్లో ఇద్దరు నేతల మధ్య తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ జరగనుంది. ఫిలడెన్షియాలోని నేషనల్ కాన్ స్టిట్యూషనల్ సెంటర్ వేదికగా ట్రంప్, కమలా హారిస్ ముఖాముఖి తలపడనున్నారు. ఏబీసీ న్యూస్ యాంకర్లు..డేవిడ్ ముయిర్, లిన్సే డేవిస్ .. ఈచర్చకు సమన్వయకర్తలుగా ఉంటారు. 90 నిముషాల పాటు చర్చ జరగుతుంది. మధ్యలో రెండు సార్లు స్వల్ప విరామముంటుంది. డిబేట్ చివరిలో చెరో రెండు నిముషాలపాటు ముగింపు ప్రసంగానికి అనుమతిస్తారు.
గతంలో జరిగిన డిబేట్ లో బైడన్ ను చాలా సులువుగా ఓడించిన ట్రంప్ కు.. కమలా మాత్రం గట్టి పోటీగానే ఉన్నారు. ఆమె వాగ్దాటిలో మేటి.. అంతేకాదు… చాలా వరకూ రాజకీయ అంశాల్లో అనుభవం కూడా ఉంది. అయితే కొన్ని విషయాల్లో మాత్రం కమలాపై సొంత పార్టీ నేతలకే గురి లేదు. ఇప్పుడీ అంశాలను ట్రంప్ ప్రస్తావించే అవకాశముంది. యుద్థక్షేత్రం, అబార్షన్లు సహా కొన్ని అంశాలకు కమలా హారిస్ సమాధానమివ్వాల్సి ఉంటుంది.
ట్రంప్ కు కేసులు పెద్ద సవాల్ గా మారనున్నాయి. వీటిని కమలా ప్రస్తావించే అవకాశముంది. మరీ ముఖ్యంగా ట్రంప్ జాత్యహంకారి, స్త్రీ లను గౌరవించని వ్యక్తి అంటూ ఇప్పటికే ఆమె బృందం ..ప్రచార పర్వాన్ని సాగిస్తోంది.అందువల్ల వీటిని ఉపయోగించి.. ట్రంప్ పై ఆధిపత్యానికి కమలా ప్రయత్నించవచ్చు. కమలాకు భారతీయులు, నల్లజాతి ఓటర్ల మద్దతు ఉండే అవకాశం కనిపిస్తోంది.అయితే ట్రంప్ మాత్రం నిరుద్యోగ యువత, వైటర్స్ మద్దతుపై ఆశలు పెట్టుకున్నారు.






