Trump: రష్యాకు భారీ ఆఫర్లు… ట్రంప్ తాజా వార్ స్ట్రాటజీ..!
రష్యా అధ్యక్షుడు పుతిన్ తగ్గేది లేదంటున్నాడు. తన షరతులకు ఒప్పుకుంటేనే శాంతి సాధ్యమని తెగేసి చెబుతున్నాడు. మరోవైపు ఉక్రెయిన్ అధినేత జెలెన్ స్కీ సైతం.. ఎన్నాళ్లైనా యుద్ధం చేస్తాం.. ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టే పరిస్థితి లేదని తేల్చి చెబుతున్నాడు. వీరిద్దరినీ ఓ మాటపైకి తెచ్చి, యుద్ధనివారణ చేద్దామని ట్రంప్.. చాలా ప్రయత్నాలు చేశారు.. చేస్తూ వస్తున్నారు కూాడా. కానీ ఏవీ పెద్దగా ఫలితాన్నివ్వడం లేదు. ఓవైపు దశాబ్దాల తరబడి యుద్ధవ్యూహాల్లో ఆరితేరిన పుతిన్.. తన స్ట్రాటజీలు పక్కాగా అమలు చేస్తున్నారు. దీంతో రష్యాను దారికి తెచ్చేందుకు ట్రంప్.. తన వ్యూహాలకు పదును పెడుతున్నారు.
మొన్నటివరకు కాల్పుల విరమణకు అంగీకరించాలని రష్యా (Russia)పై ఆంక్షలు విధిస్తూ ఒత్తిడి తెచ్చిన ట్రంప్.. ఇప్పుడు రూట్ మార్చారు. పాత విధానాలు పెద్దగా ఫలితాన్నివ్వకపోవడంతో.. ఇక కొత్త ప్రతిపాదనలు తెరపైకి తెచ్చారు. మాస్కోకు అనుకూలంగా కొన్ని ఆఫర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది (Russia-Ukraine peace plan).
ఇటీవల యూరోపియన్ దేశాలకు అందజేసిన శాంతి ప్రణాళికలో అనుబంధంగా ట్రంప్ తాజా ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో యూరప్ దేశాలకు రష్యా నుంచి ఇంధన సరఫరాను పునరుద్ధరించాలనేది కూడా ఒకటి. ఆ దేశంలోని అరుదైన ఖనిఖ రంగాల్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు.. స్తంభింపజేసిన రష్యా ఆస్తుల విడుదల వంటి పలు ప్రతిపాదనలు ఉన్నాయి. దీనిలోనే అమెరికా వ్యాపార, ఆర్థిక సంస్థలు స్తంభింపజేసిన రష్యా సావరిన్ ఫండ్ నిధులను ఉక్రెయిన్లో ప్రాజెక్టులకు వినియోగించే ప్రణాళిక ఉంది. జపోరిజియా అణు విద్యుత్తుకేంద్రం శక్తితో ఓ డేటా సెంటర్ ఏర్పాటు వంటి అంశాలున్నాయి. రష్యాలోని అరుదైన ఖనిజాల వెలికితీత, చమురు తవ్వకం వంటి వ్యూహాత్మక రంగాల్లో అమెరికా కంపెనీలు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు.
రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ముగించేందుకు ట్రంప్ ఇటీవల 28 సూత్రాలతో శాంతి ప్రణాళికను రూపొందించారు. ఇందులో ఎక్కువ అంశాలు రష్యాకు అనుకూలంగా ఉన్నాయని నాటో దేశాలు ఆందోళన వ్యక్తంచేశాయి. ఈ క్రమంలో ఇందులో సవరణలు సూచించాయి. ఈ శాంతి ప్రణాళికను ముందుకు తీసుకెళ్లే అంశంపై అగ్రరాజ్యం మధ్యవర్తిత్వంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో కీవ్ నుంచి సరైన స్పందన రాకపోవడంపై ట్రంప్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శాంతి ప్రతిపాదనను ఇంకా చదవకపోవడం తనను నిరాశ కలిగించిందన్నారు. ఆ దేశ ప్రజలు ఇష్టపడుతున్న దీన్ని.. జెలెన్స్కీ మాత్రం అంగీకరించడం లేదన్నారు.






