Poland: ట్రంప్ నోబెల్ ప్రతిపాదనలకు తిరస్కరణ.. అమెరికా తీరుపై పోలండ్ ఫైర్..!
అమెరికాకు మిత్రదేశం పోలండ్ షాకిచ్చింది. అగ్రరాజ్యం సూచనలను నేరుగా తిరస్కరించింది. తమకు దౌత్యం సంగతి బాగా తెలుసని.. మీరు చెప్పక్కరలేదంది. ముందు మీపని మీరు చూసుకోండని చురకలు వేసింది.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నోబెల్ బహుమతికి నామినేట్ చేయడానికి పోలండ్ నిరాకరించడం ఇరుదేశాల మధ్య దౌత్య వివాదానికి దారితీసింది. ఈ పరిణామాలను అగ్రరాజ్య దౌత్యవేత్త తీవ్రంగా ఖండించగా.. పోలండ్ ప్రధాని ఘాటుగా బదులిచ్చారు.
మధ్యప్రాచ్యంలో శాంతియుత పరిస్థితులు నెలకొల్పేలా చేసినందుకు గానూ.. వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును నామినేట్ చేయాలని అమెరికా, ఇజ్రాయెల్ నుంచి పోలండ్ పార్లమెంట్‌కు ప్రతిపాదనలు వచ్చాయి. దీన్ని పోలండ్ స్పీకర్ తిరస్కరించారు. ‘‘బలవంతపు రాజకీయాలు, విధానాలతో ట్రంప్ అంతర్జాతీయ సంస్థలను అస్థిరపరుస్తున్నారు. ఆయన నోబెల్‌కు అనర్హులు. ఈ ప్రతిపాదనను మేం తిరస్కరిస్తున్నాం’’ అని పోలండ్ స్పీకర్ ప్రకటించారు.
ఈ చర్యను అమెరికా తీవ్రంగా పరిగణించింది. దీనిపై పోలండ్‌లోని అమెరికా దౌత్యవేత్త టామ్ రోజ్ స్పందిస్తూ.. ‘‘ఇది ట్రంప్‌ను అవమానించడమే. దీనివల్ల ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆయనను మా దేశంలోకి రానివ్వకుండా బ్లాక్‌లిస్ట్ చేస్తాం’’ అని పేర్కొన్నారు. దీనిపై పోలండ్ ప్రధాని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘మిత్ర దేశాలు పరస్పరం గౌరవించుకోవాలి. అంతేగానీ ఇలా మాకు పాఠాలు చెప్పే ప్రయత్నం చేయొద్దు. దౌత్య సంబంధాలు ఎలా నిర్వహించాలో మాకు తెలుసు’’ అని హితవు పలికారు.













