ద డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ వివాదం…
మొన్న.. కశ్మీర్ ఫైల్స్ దేశాన్ని ఊపేసింది. నిన్న.. ది కేరళ స్టోరీ సూపర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఈ వివాదాల సినిమా పరంపరలో మరో సినిమా వచ్చి చేరనుంది. అదే ద డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఈసినిమా ట్రైలర్ విడుదల కావడంతోనే.. బెంగాల్ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. బెంగాలీల పరువును మంటగలిపేందుకే ఈసినిమా నిర్మాణమంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. అంతే కాదు .. ఆ సినిమా నిర్మాత జితేంద్ర నారాయణ సింగ్, డైరెక్టర్ సనోజ్ మిశ్రాపై చర్యలు ప్రారంభమయ్యాయి. కోల్ కతా పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ట్రైలర్లో చూపించినవి అక్కడి ప్రజల ప్రత్యక్ష అనుభవాలు. భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేసే చర్యలను మమతా బెనర్జీ మానుకోవాలని బీజేపీ నేతలు సూచిస్తున్నారు.. విలువలు లేని ప్రభుత్వాన్ని నడుపుతున్న టీఎంసీ ప్రభుత్వానికి .. ప్రజలు తగిన బుద్ధి చెబుతారని బీజేపీ నేత అమిత్ మాలవీయ విమర్శలు గుప్పించారు.
ఈసినిమా ట్రైలర్ లో రోహింగ్యాలు, బంగ్లాదేశీ ముస్లింలు.. ఏవిధంగా రాష్ట్రంలో సెటిలవుతున్నారన్న విషయాన్ని చూపించారు. వారి కారణంగా స్థానికులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. దీనికి తోడు సీఏఏ,ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా మమత బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన నిరనసలను స్పృశించారు. 2013లో నళియా ఖాళీ గ్రామంలో 200 మంది హిందువుల ఇళ్లను తగులబెట్టిన అంశాన్ని ప్రస్తావించారు.
బెంగాల్ పరువు తీయాలన్నది తమ ఉద్దేశ్యం కాదని డైరెక్టర్ మిశ్రా చెబుతున్నారు. తాము చాలా పరిశోధించి, వాస్తవాల ఆధారంగా సినిమా తీసేందుకు సిద్ధమయ్యామన్నారు. తాను ఒక్కసారి బెంగాల్ వెళ్తే , ఇక తిరిగి వచ్చే పరిస్థితి లేదన్నారు డైరెక్టర్ మిశ్రా. ఓ బోగస్ కేసులో తనను ఇరికించారన్నారు. తాను పూర్తి వాస్తవాల ఆధారంగా సినిమా నిర్మాణం చేపట్టానని.. ఆగస్టులో సీినిమా విడుదల చేయాలన్నది తన ఉద్దేశ్యమన్నారు. ఇదే విషయమై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు విన్నవించుకున్నట్లు తెలిపారు. బెంగాల్ రాష్ట్రంలో సామూహిక హత్యలు, అత్యాచారాలు, హిందువులపై అఘాయిత్యాలు కామన్ అయ్యాయని.. వాటిని పరిశోధించి సినిమా నిర్మిస్తున్నట్లు వివరించారు.













