భస్మీపటలం…
ఎటు చూసినా కాలిన భవనాలు… చెల్లా చెదురుగా మృతదేహాలు.. అందాల హవాయి ఇప్పుడు అగ్నిగుండమైంది. కార్చిచ్చు దావానలంలా వ్యాపించడంతో .. మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇప్పటివరకూ 67 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. దీంతో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
హవాయి దీవుల్లో ఈ వారం తొలినాళ్లల్లో మొదలైన కార్చిచ్చు, ఇంకా శాంతించలేదు. దావానలాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. అయితే.. ఇప్పటికీ మంటలు అదుపులోకి రావడం లేదు. ఎంతగా ప్రయత్నిస్తున్నా.. మంటల వ్యాప్తి ఆగడం లేదు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం, అధికారులు.. కార్చిచ్చు ప్రభావిత ప్రాంత ప్రజలను .. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే.. కార్చిచ్చు వ్యాపించినప్పుడు సైరన్లు మోగకపోవడంతో ప్రమాదం తీవ్రత ఎక్కువైందని అధికారులు గుర్తించారు. సైరన్లు ఎందుకు మోగలేదు? అన్న విషయంపై దర్యాప్తు చేపట్టారు. మంటలు వ్యాపించిన కొద్దిసేపటికే టెలికమ్యూనికేషన్ వ్యవస్థ నాశనమైందని.. అందుకే ప్రజలకు త్వరగా సమాచారం అందలేని గవర్నర్ గ్రీన్ తెలిపారు. ప్రస్తుతం రక్షణ చర్యలు చేపడుతున్న సిబ్బంది.. చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని.. అయినా ప్రజల్ని రక్షించే చర్యలను మరింత వేగవంతం చేస్తున్నామన్నారు.
హవాయి దీవుల్లో కార్చిచ్చు నేపథ్యంలో గవర్నర్ గ్రీన్‌తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడినట్టు శ్వేతసౌధం వెల్లడించింది. అక్కడి తాజా పరిస్థితులను బైడెన్ అడిగి తెలుసుకున్నారని వివరించింది. అంతేకాదు.. అక్కడ సహాయక చర్యల్ని మరింత వేగవంతం చేయడంతో పాటు.. పౌరుల రక్షణ చర్యలను మరింత సమర్థంగా చేపట్టాలని సూచించినట్లు సమాచారం.













