చెన్నై.. కన్నీటి చెరువై..
మిచౌంగ్ తుపాను .. చెన్నైలో విలయాన్ని సృష్టించింది. తమిళనాడు రాజధానితో పాటు శివారు జిల్లాల్లో జల ప్రళయం కొనసాగుతోంది. ఆదివారం రాత్రి నుంచీ ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి కురిసింది.. సోమవారం మధ్యాహ్నానికే చెన్నై, శివారు జిల్లాల్లో 35 సెంటీమీటర్ల వర్షం నమోదైంది! దాంతో వీధులన్నీ వాగులుగా మారాయి.
నగరంలో వరద పోటెత్తింది. ఇళ్లు, పార్కింగ్ ప్రదేశాల్లో ఉన్న వందలాది కార్లు, వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి! నడుం లోతుకు పైగా నీరు చేరడంతో నగరంలోని అన్ని హైవేలను, సబ్‌వేలను మూసేశారు. రన్ వేపైకి నీరు చేరడంతో చెన్నై విమానాశ్రయాన్ని కూడా తాత్కాలికంగా మూసేశారు. 160 విమాన సేవలు రద్దయ్యాయి. అయితే..ప్రస్తుతం వర్షం తగ్గుముఖం పట్టడంతో సేవలు పునరుద్ధరించారు.
దివంగత సీఎం జయలలిత నివాసం, సూపర్‌స్టార్ రజనీకాంత్ వంటి ప్రముఖులుండే పోయెస్ గార్డెన్ హైవే.. 7 అడుగుల మేర కుంగింది! టాన్స్‌ఫార్మర్లు, వాహనాలు అందులో పడిపోయాయి. వాన బీభత్సం కొనసాగుతుండటంతో సహాయ చర్యలూ చేపట్టలేని పరిస్థితి ఉంది. ప్రజలంతా ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటున్నారు.చెన్నై శివారులోని జాతీయ రహదారి వరద నీటిలో మునగడంతో రాకపోకలు స్తంభించాయి. నగరం, శివార్లలోని చెరువులు, రిజర్వాయర్లు నిండడంతో అడయార్, కూవం నదులు, బకింగ్ హాం కాలువల ద్వారా చెన్నై వైపుగా వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
వరద నీటిని తొలగించేందుకు ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో మంగళవారం కార్యాలయాలు, పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమిళనాడు సీఎం స్టాలిన్‌తో ఫోన్లో సహాయక చర్యలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. వేలాది మంది నిర్వాసితులై చెన్నై, శివార్లలో వందలాది శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.
47 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా.. చెన్నై నగరంలోఅత్యంత భారీ వర్షం నమోదైంది. 2015 నాటి కుంభవృష్టిని కూడా మించిపోయింది. అప్పటి కష్టాలు పునరావృతం కాకుండా చూసేందుకు డీఎంకే ప్రభుత్వం …నగరంలో రూ.4 వేల కోట్లతో నిర్మించిన వరద కాల్వలు పూర్తిగా వాడకంలోకి రాకపోవడంతో ఈసారీ ముంపు సమస్య తలెత్తింది.













