దోస్త్ మేరా దోస్త్…
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ హైకమాండ్ పావులు కదుపుతోంది. కొంత కాలంగా సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య కొనసాగుతున్న విభేదాల పర్వానికి తెరదించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గతంలో ఓసారి ఇరువురు నేతలను కూర్చో పెట్టి చర్చించినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. సచిన్ పైలట్ సొంత కుంపటి పెట్టుకుంటారన్న ఊహాగానాలు వినిపించాయి.అయితే ..కర్నాటకలో గెలుపుతో హైకమాండ్ శక్తిమంతంగా మారింది. ఇరువురు నేతలను పిలిచి చర్చించింది. దీంతో ఇరువురు నేతలు ఐక్యతారాగాన్ని ఆరోపించారు.
ఎన్నికల్లో గెలుపే ముఖ్యమన్న హైకమాండ్… ఐక్యంగా సాగితేనే గెలుపుసాధ్యమని ఇరువురు నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం. అంతేకాదు… క్రమశిక్షణ కొనసాగించని పార్టీ నేతలపై వేటు తప్పదని కాంగ్రెస్ అధిష్టానం గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ ఫోరమ్ వెలపల ఎవరూ మాట్లాడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం.. ఈసారి ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవచ్చని పార్టీ సూచించింది.
వసుంధర రాజే ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోలేదంటూ గెహ్లాట్ ప్రభుత్వంపై.. ఇప్పటికే పలుమార్లు సచిన్ పైలట్ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఈ అంశంపై ఇరువురు నేతల మధ్య ఎప్పటికప్పుడు మాటల తూటాలు పేలుతున్నాయి.అయితే ఈఅంశంపై.. గతాన్ని వదిలి భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్లు పైలట్ తెలిపారు.2018 ఎన్నికల్లో కూడా పార్టీ ఐక్య ఫ్రంట్‌గా పోరాడిందని, అప్పుడు కూడా సీఎం అభ్యర్థిని ప్రకటించలేదని.. ఎన్నికల తర్వాతే సీఎం అభ్యర్థిని ప్రకటించారని పైలట్ అన్నారు.
ఇరువురు నేతలు కలిసికట్టుగా పోరాడితే మళ్లీ గెలుపు తథ్యమని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. అందుకు తగినట్లుగా శ్రేణులను సిద్ధం చేయాలని ఇరువురు నేతలకు సూచించింది. ఈ గెలుపు సార్వత్రిక ఎన్నికల ముందు పార్టీకి అత్యవసరమని తలుస్తోంది. ఆదిశగా ఎక్కడా ఎలాంటి పొరపాటు జరగకుండా చూడాలని నేతలకు పక్కాగా ఆదేశాలిచ్చింది. అంతే కాదు.. మ్యానిఫెస్టోపైనా ఫోకస్ పెట్టింది. ఏయే అంశాలతో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై సమగ్ర వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది.













