ఉత్తరాది ‘ఆధిపత్య’ ఛాయల్లో దక్షిణభారతం?
అభివృద్ధిలో పెరుగుతున్న అంతరం.. పరిపాలకుల ఆలోచనా ధోరణి .. దేశప్రజలను రెండుగా విభజిస్తోందా..? అభివృద్ధి, ప్రాజెక్టులు అన్నీ ఉత్తరాదికే పరిమితం అవుతున్నాయని.. దక్షిణాది ప్రజల మనసుల్లో ఆందోళన గూడు కట్టుకుందా..? ఎవరెన్ని చెప్పినా, అంతా ఉత్తరాది వాళ్లదేలే.. మనకు విలువ లేదన్న భావన కనిపిస్తోందా..? ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే అవుననే వాదన వినిపిస్తోంది. గతంతో పోలిస్తే ముఖ్యంగా ప్రధాని మోడీ పాలన సందర్భంగా ఆ ఆందోళనలు మరింతగా పేరుకుపోతున్నాయి.
మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఉత్తరాది అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని దక్షిణాది ప్రజలే కాదు, నేతలు సైతం ఆరోపిస్తున్నారు. అందుకు తగినట్లుగానే మోడీ సర్కార్.. అత్యధిక ప్రాజెక్టులు, నిధులు గుజరాత్‌కే తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉండనే ఉన్నాయి. బుల్లెట్ రైలు అయితే నేమి, అంతర్జాతీయ కంపెనీల ప్రాజెక్టులు అయితేనేమి అన్నీ మహారాష్ట్ర, గుజరాత్ వైపే తరలిపోయాయి. కొత్త పెట్టుబడులు సైతం అక్కడికే వస్తున్నాయి. దక్షిణాదికి ప్రాజెక్టులు వచ్చినా అవి నామమాత్రంగా ఉన్నాయని ఇక్కడి ప్రజాప్రతినిధులు సైతం అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు.
ఈ విషయంలో మరింతగా ముందుకెళ్లిన కర్నాటక కాంగ్రెస్ ఎంపీ డికే సురేష్… ఏకంగా దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేక దేశం కావాలనడం రాజకీయ దుమారాన్ని రేపింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది నుంచి వసూలు చేసిన పన్నులను ఉత్తరాదికి మళ్లిస్తోందని ఆరోపించారు. దక్షిణాదిపై వివక్షను కొనసాగిస్తోందన్నారు. తగిన నిధులు ఇవ్వకుండా అన్యాయం చూస్తే పోతే…. దక్షిణాది రాష్ట్రాల ప్రజల కోసం ప్రత్యేక దేశం డిమాండ్ చేస్తామని అన్నారు డీకే శివకుమార్. రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లపై వివక్షను సరిచేయకపోతే….. దక్షిణ భారతీయులు ప్రత్యేక దేశం కోసం గళం విప్పడం అనివార్యమవుతుందని చెప్పారు.
డికె సురేష్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. పార్లమెంట్లో కూడా ఈ విషయంపై రగడ జరిగింది. ఎంపీ డీకే సురేష్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఖండించారు. అది రాజ్యాంగ విరుద్దమని… డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను నీరుగార్చడమే అని మండిపడ్డారు. దేశాన్ని విభజించాలన్న డీకే సురేష్‌పై పార్లమెంటరీ యాక్షన్ కమిటీ చర్యలు తీసుకోవాలని కోరారాయన. తామందరం దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన వాళ్లమేనని ఈ సందర్భంగా గుర్తుచేశారు. దేశాన్ని విభజించాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారంటూ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇవి రాజకీయంగా ఉన్నంతవరకూ ఎవరికి ఇబ్బంది లేదు. కానీ .. ఇవి నిజంగా ప్రజల మనసుల్లో నాటుకుంటే.. చాలా ప్రమాదం. ఎందుకంటే విభజన వాదం.. ప్రజల్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో చెప్పలేం. అది తీవ్రవాదం, ఉగ్రవాదాల వైపు దారి తీసే ప్రమాదముంది. ఇలాంటి సంకేతాలను తేలిగ్గా తీసుకోవడం కన్నా..ఎందుకు ఇలాంటి వాదనలు వస్తున్నాయన్న అంశంపై కేంద్రం దృష్టి సారిస్తే.. దేశానికి , ప్రజలకు, రాజకీయ నాయకులకు కూడా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.













