India: భారత్ సహకారంతోనే చైనాకు ముకుతాడు..USA వార్షిక డిఫెన్స్ పాలసీ బిల్..!
ఓవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్ పై ఆంక్షలతో చెలరేగుతున్నారు. రష్యా చమురు కొనుగోళ్లు ఆపడం లేదన్న సాకుతూ భారీగా టారిఫ్ విధించారు. ఇకనైనా తగ్గకుంటే.. మరిన్ని ఆంక్షలు తప్పవని హెచ్చరికలు కూడా చేశారు . ఈపరిస్థితుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన.. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపింది. ముఖ్యంగా ప్రొటోకాల్ పక్కన పెట్టి మరీ పుతిన్ కు..భారత ప్రధాని మోడీ పాలం విమానాశ్రయంలో స్వాగతం పలకడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై పాశ్చాత్య మీడియాలో భిన్న స్పందనలు వెలువడుతున్నాయి.
అయితే…ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనాతో జరుగుతున్న వ్యూహాత్మక పోటీలో ఆధిపత్యం పొందేందుకు భారత్ (India)తో సంబంధాలు బలోపేతం చేసుకోవాలని అమెరికా (USA) వార్షిక డిఫెన్స్ పాలసీ బిల్లు స్పష్టం చేసింది. ‘ది నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ -2026ను కాంగ్రెషనల్ నాయకులు విడుదల చేశారు. దీనిలో అమెరికా రక్షణ మంత్రి ..భారత్తో డిఫెన్స్ రంగంలో భాగస్వామ్యాన్ని మరింత ముందుకుతీసుకెళ్లాలని సూచించారు. ఇందుకోసం విదేశాంగశాఖ మంత్రితో సమన్వయం చేసుకోవాల్సి ఉందన్నారు. అప్పుడే ఇండో-పసిఫిక్లో చైనాపై ఆధిపత్యం సాధ్యమవుతుందని వెల్లడించారు. ఇందుకు క్వాడ్ కూటమి వంటివి ఉపయోగపడతాయని తెలిపారు.
అమెరికా విదేశాంగ మంత్రి యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ సెక్యూరిటీ డైలాగ్ వంటి సంప్రదింపుల వ్యవస్థను ఏర్పాటుచేయాలని సదరు బిల్లులో పేర్కొంది. ఇది భారత్-అమెరికా మధ్య 2008లో జరిగిన పౌర అణుఒప్పంద పురోగతిని సమీక్షించాలని సూచించింది. ఇక ఈ చట్టం అమల్లోకి వచ్చిన 180 రోజుల్లో అమెరికా విదేశాంగ మంత్రి సంయుక్త అంచనాలను నివేదిక రూపంలో ఇవ్వాలని సూచించింది.
– Srinivasa Mohan






