సెమీఫైనల్స్…
2024 ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ను గద్దెదించడంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. మరీ ముఖ్యంగా కన్నడ ఫలితాలతో జవసత్వాలు నింపుకున్న హస్తం పార్టీనేతలు.. నాలుగు రాష్ట్రాల ఎన్నికలను సెమీఫైనల్స్ గా భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రజాతీర్పుతో బీజేపీని చావుదెబ్బ కొట్టగలిగితే, ఢిల్లీని సులభంగా చేరుకోవచ్చని భావిస్తున్నారు. దీనికి సంబంధించి బ్లూప్రింట్ రూపకల్పనలో పార్టీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది.
తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని, బీజేపీ ఎక్కడా కనిపించదని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.పేదల పక్షాన నిలబడటమే తమ పార్టీ గెలుపునకు కారణమవుతుందని, బీజేపీ కేవలం ఇద్దరు ముగ్గురికి మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుందని విమర్శించారు. హింస, విద్వేషాల వ్యాప్తికి బీజేపీ పనిచేస్తోందని, తాము ప్రేమతోనే విద్వేషాన్ని ఎదుర్కొంటామని చెప్పారు. పాట్నాలో విపక్షాల ఐక్యకూటమి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన రాహుల్ గాంధీ .. కాంగ్రెస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఇండియాలో సిద్ధాంతాల మధ్య పోరు జరుగుతోందన్నారు రాహుల్… ఒక వైపు కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో’ సిద్ధాంతం, మరోవైపు ఆర్ఎస్ఎస్-బీపీసీల ‘భారత్ టోడో’ సిద్ధాంతం ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ బీహార్లో ఉందని రాహుల్ తెలిపారు. బీజేపీని సమష్టిగా ఓడించేందుకు విపక్ష పార్టీలు అన్నీ ఇక్కడకు వచ్చాయని చెప్పాయి. మరోవైపు మనం బిహార్ లో గెలిస్తే దేశవ్యాప్తంగా గెలుస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే.. పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
రాజస్తాన్, చత్తీస్ ఘడ్ రాష్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. అయితే రాజస్తాన్ లో గహ్లోత్-సచిన్ పైలట్ వివాదం పార్టీని సమస్యల్లోకి నెట్టేసింది. దీంతో ఈ సమస్య పరిష్కారంపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇద్దరితో చర్చించి ప్రస్తుతానికి మమ అనిపించింది. అయితే ఇద్దరూ కలిసికట్టుగా పనిచేస్తే అధికారం దక్కించుకోవచ్చని పార్టీనేతలు భావిస్తున్నారు. చత్తీస్ గఢ్ రాష్ట్రంలో భగేల్ కు కాస్త ప్రజావ్యతిరేకత ఉంది. దీనికి తోడు పార్టీలోని గ్రూప్ తగాదాలు ..కాంగ్రెస్ ను ఇబ్బంది పెడుతున్నాయి.
తెలంగాణలో పార్టీశ్రేణులు కలిసికట్టుగా పనిచేస్తే అధికారం ఖాయమని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. మరీ ముఖ్యంగా కేసీఆర్ పై వ్యతిరేకతే తమకు ప్రధాన ఆయుధంగా భావిస్తోంది. ఇప్పటికే సీనియర్లు ఏకతాటిపైకి వస్తున్న సంకేతాలున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల్లో పార్టీపై సానుభూతి ఉందని.. కమల్ నాథ్ రూపంలో గట్టి నేత ఉన్నాడని.. ఇక్కడా గెలుపు ఖాయమని విశ్వసిస్తోంది.













