కాంగ్రెస్ ఓటమిపై ‘పంచనామా’..!
మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం .. ఆపార్టీని ఆలోచనలో పడేసింది. గెలుస్తామనుకున్న చోట కూడా ఎందుకు ఓడామన్న అంశం.. ఆపార్టీని సమాలోచనలో పడేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించడం.. కమలదళంలో ఉత్సాహాన్ని కలిగించింది.. మూడు రాష్ట్రాల్లో ఓటమి అసహనాన్ని పార్లమెంటులో ప్రదర్శించొద్దని ప్రధాని మోడీ అప్పుడే సెటైర్లు వేశారు. దీనికి కాంగ్రెస్ నేతలు కూడా ధీటుగా స్పందించారు. ఇదే అంశాన్ని కర్నాటకలో ఓడినప్పుడు మోడీ ఎందుకు ప్రస్తావించలేదో తెలియాల్సి ఉందన్నారు.
మరో వైపు.. ప్రస్తుత ఓటమి… ప్రతిపక్ష కూటమి ఇండియా (ఇండియా అలయన్స్) భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జాతీయ స్థాయి కూటమి ఏర్పడినప్పుడు, ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒంటరిగా ఎన్నికల్లో ఎందుకు పోటీ చేసిందనే ప్రశ్నను కూటమిలోని పార్టీలే లేవనెత్తుతున్నాయి. కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని కూడా ఆయా పార్టీలు చెబుతున్నాయి. మూడు రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయాలని కాంగ్రెస్ ఎందుకు నిర్ణయించుకుందనే దానిపైనా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
అయితే పార్టీ కేంద్ర నాయకులు పొత్తు ఆవశ్యకతను తెలుసుకున్నారని, హిందీ బెల్ట్‌లోని రాష్ట్ర స్థాయి నాయకులు కూటమి అవసరాన్ని గ్రహించాల్సి ఉందని సీనియర్లు చెబుతున్నారు. ట్రాక్ రికార్డ్ లేదా ఇతర విషయాల ఆధారంగా టిక్కెట్లు ఇచ్చే బదులు, కాంగ్రెస్ అభ్యర్థికి ప్రస్తుతం గెలిచేందుకు గల అవకాశాలను పరిశీలించిన తర్వాతనే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వాల్సి ఉందన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల రాజకీయాల్లో ద్వంద్వ స్వభావం ఉందని, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని గుర్తు చేస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని పరిస్థితిని కాంగ్రెస్ అర్థం చేసుకోలేకపోయిందన్నారు నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, ఇండియా అలయన్స్ సభ్యుడు ఒమర్ అబ్దుల్లా . అఖిలేష్ యాదవ్ పార్టీకి 5 నుంచి 7 సీట్లు ఇస్తే ఏమి నష్టం జరిగేదని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికలలో ఇండియా కూటమి ఫలితాల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపైనా పడే ప్రమాదముందన్నారు. ఇకనైనా కాంగ్రెస్ కళ్లు తెరవాలన్నారు. ఈ ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ …భారత కూటమి సమావేశానికి పిలుపునిచ్చింది. న్యూఢిల్లీలో జరిగే ఈసమావేశానికి మమతా బెనర్జీ హాజరుకావడం లేదని టీఎంసీ వర్గాలు తెలిపాయి.













