కోటాలో కోటా..?
పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లును తెచ్చి, ఆక్రెడిట్ ను కొట్టేయాలని కేంద్రం భావిస్తుంటే… దానికి విపక్షాలు కౌంటర్ సిద్ధం చేశాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికే లేటైందని.. వెంటనే అమల్లోకి తేవాలని డిమాండ్ చేశాయి. దీనికితోడు ఇందులో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు కోటా లేదని నిరసించాయి. దీనికి తోడు కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇవన్నీ లేకుండా బిల్లు తేవడం అంటే .. అది అసమగ్రమైన బిల్లని ఆరోపిస్తున్నాయి.
మహిళాబిల్లులో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కావాలని ఎందుకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ తరపు ఎవరూ ఎందుకు ప్రశ్నించడం లేదన్న దానిపైనా వాదనలున్నాయి. మహిళా బిల్ క్రెడిట్ ఇప్పుడు తమ ఖాతాలోకి వేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ రిజర్వేషన్ బిల్ ఇదే విధంగా ఉంటే.. మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత.. తమకే దక్కుతుందని ఫలితంగా .. అది ఎన్నికల ముందు ఓటు బ్యాంకుగా మారుతుందని కమలనాథులు విశ్వసిస్తున్నారు. అందుకే మహిళా బిల్‌ను.. పార్లమెంటు సమావేశాల్లో పాస్ చేయించారు. దీనికి విపక్ష కాంగ్రెస్ సహా దాదాపు అన్నిపార్టీలు సహకరించాయి.
అయితే కాంగ్రెస్ సహా విపక్షాల్లో చాలా పార్టీలు.. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లను అనాదిగా సాధిస్తున్నాయి. ఈ వర్గాలకు మహిళాబిల్లో కోటా కల్పించగలిగితే.. అవి, ఈపార్టీలకు మరింత బలాన్ని చేకూరుస్తాయనడంలో సందేహం లేదు. అందుకే ఆయా పార్టీలు.. కోటాలో కోటాకు డిమాండ్ చేస్తున్నాయి. ఉదాహరణకు మాయావతి పార్టీ ఓటుబ్యాంక్ .. మహిళలు, ఎస్సీ, ఎస్టీలే.. ఇక ఎస్పీకూడా ఓబీసీ, మైనార్టీల ఓట్లపై ఆధారపడి రాజకీయాలు చేస్తోంది. ఇలా చాలా పార్టీలు .. ఆయా కమ్యూనిటీలకు పెద్దదిక్కులా ప్రవర్తిస్తున్నాయి. దీంతో ఎక్కడ ఓటు బ్యాంకు చీలిపోతుందో అన్న భయం బీజేపీ నేతల్లో కనిపిస్తోంది.
మరో వైపు.. కులగణన కూడా చేయాలని ఆపార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కులగణన ఎప్పుడో దశాబ్దం క్రితం చేసిందే తప్ప… ఇటీవలి కాలంలో జరగలేదు. తాజా లెక్కలను తీస్తే ఆయా వర్గాల ఓట్లు, సీట్లు మరింతగా పెరిగే అవకాశముంది. ఫలితంగా మహిళా రిజర్వేషన్ కోటాతో పాటు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళల కోటా కూడా పెరిగే అవకాశముంది. అంటే విపక్షాలకు సైతం రాజకీయంగా లబ్ధి చేకూరనున్నట్లు తెలుస్తోంది. అందుకే కోటాపై కోటాను విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.













