ఢిల్లీకి మళ్లీ తాళం! అర్థం చేసుకోవాలన్న కేజ్రీవాల్!!
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. మళ్లీ కఠిన ఆంక్షలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం ఆరు రోజులపాటు లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని.. ప్రజలెవరూ బయటకు రావద్దని ఢిల్లీ సీఎం కేజ్రివాల్ చేతులెత్తి వేడుకున్నారు. లాక్ డౌన్ విధించడం తనకు ఇష్టం లేదని.. కానీ తప్పట్లేదని వివరించారు. పరిస్థితి అర్థం చేసుకోవాలన్నారు.
కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ఆరు రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు కేజ్రీవాల్ ప్రకటించారు. ఈరోజు రాత్రి నుంచే లాక్డౌన్ అమల్లోకి వస్తుందన్నారు. ఏప్రిల్ 26 ఉదయం వరకు లాక్డౌన్ కొనసాగుతుందని కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రస్తుతం ఢిల్లీలో రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతపు లాక్డౌన్ అమలవుతోంది. అయితే.. పరిస్థితుల దృష్ట్యా లాక్డౌన్ తప్పట్లేదన్నారు కేజ్రీవాల్. దేశంలో సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ లాక్ డౌన్ విధించిన తొలి రాష్ట్రంగా ఢిల్లీ రికార్డులకెక్కింది.
ఢిల్లీలో ఇటీవల కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. పరీక్షించిన ప్రతి ముగ్గురిలో ఒకరికి పాజిటివ్ గా నిర్ధారణ అవుతోంది. నాలుగు రోజుల క్రితం పాజిటివిటీ రేటు 16శాతం ఉండగా.. ఇప్పుడది 30శాతానికి చేరుకుంది. అందుకే ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితి చేయిదాటిపోక ముందే కట్టిడి చేయాలని నిర్ణయించింది. అందుకు లాక్ డౌన్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ఢిల్లీ సర్కార్ భావించింది. అందుకే లాక్ డౌన్ విధించింది.
మహారాష్ట్రతో పోల్చితే ఢిల్లీలో కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. అయినా కేజ్రివాల్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నారు. నాలుగు రోజులకిందటే కేజ్రివాల్ వీకెండ్ లాక్ డౌన్ అమలుచేశారు. రాత్రి పూట కర్ప్యూ కూడా విధించారు. ఇంతలోనే పూర్తిస్థాయి లాక్ డౌన్ కు వెళ్లడం ఆశ్చర్యపరిచింది. అయితే ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలక ముందే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందన్నారు కేజ్రివాల్. లాక్ డౌన్ ను చివరి అస్త్రంగానే ప్రయోగిస్తున్నట్టు చెప్పారు.
ఢిల్లీలో రోజుకు 25వేల వరకూ కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. ఆక్సిజన్ కూడా సరిపడా నిల్వలేదు. రెమిడిసివర్ కూడా దొరకట్లేదు. అందుకే.. పరిస్థితి మరింత విషమించకముందే మేల్కోవాల్సిన పరిస్థితి ఏర్పడడం వల్లే లాక్ డౌన్ విధిస్తున్నట్టు కేజ్రివాల్ వెల్లడించారు. ప్రజలందరూ సమిష్టిగా కరోనాపై యుద్ధం చేయాల్సి వచ్చిందన్నారు. సహకరించాలని వేడుకున్నారు.













