తత్త్వం భోదపడిందా చైనా…?
ప్రపంచాన్ని ఏలాలన్న కాంక్ష.. దశాబ్దాల స్వప్నం… దానికోసం ఇరుగు, పొరుగు దేశాలతో కయ్యం..సముద్ర జలాల్లో సైతం అడ్డుగా కంచెలు వేసిన దురాగతం.. ఇవన్నీ కమ్యూనిస్టు చైనా సొంతం. మొన్నటివరకూ నువ్వెంతంటే, నువ్వెంతంటూ అగ్రరాజ్యం అమెరికాను నిలదీసిన వైనం. అలాంటి చైనా ఇప్పుడు నెమ్మదిగా స్వరం మారుస్తోంది. అగ్రరాజ్యం అమెరికా, యూరోపియన్ దేశాలతో మైత్రికి తహతహలాడుతోంది. ఇంతలో ఎందుకింతలా చైనా స్వరం మారుతోంది…? అసలు చైనాలో ఏం జరుగుతోంది?
అమెరికాను వెనక్కి నెట్టాలని.. అగ్రరాజ్యంగా ఎదగాలనే ఆకాంక్షతో ఇన్నాళ్లూ పని చేసిన చైనా.. అమెరికాను శత్రువుగా చూసేది. అయితే ఇటీవలి కాలంలో డ్రాగన్ వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికాతో దోస్తీకి ఆ దేశం ప్రాధాన్యం ఇస్తోంది. నిన్న మొన్నటి దాకా అమెరికాపై ఓ రేంజ్లో విరుచుకుపడిన చైనా మీడియా వైఖరిలోనూ ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. అమెరికా, చైనా మిత్ర దేశాలని.. ఇరు దేేశాల మధ్య ఎప్పటి నుంచో స్నేహం ఉందంటూ కథనాలను ప్రచురిస్తోంది.
చైనా అధినేత జిన్‌పింగ్ ఇటీవల మాట్లాడుతూ.. తాము ఎవరితోనూ కోల్డ్ వార్ లేదా హాట్ వార్ కోరుకోవడం లేదన్నారు. కొంత కాలంగా చైనా, అమెరికా స్నేహ సంబంధాల గురించి చైనా మీడియాలో కథనాలు రావడం మొదలయ్యాయి. ఆ దేశ మీడియాలో వచ్చిన ఈ మార్పు ఆసక్తికరంగా మారింది. నవంబర్ 15న అమెరికా అధ్యక్షుడు బిడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ శాన్ ఫ్రాన్సిస్కోలో సమావేశం అయ్యారు. ఈ భేటీకి కొద్ది వారాల ముందు నుంచి అమెరికా పట్ల చైనా మీడియా వైఖరిలో మార్పు మొదలైంది.
‘ఫ్లయింగ్ టైగర్స్’ అని పిలిచే అమెరికా ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్‌కు వ్యతిరేకంగా చైనా మిలటరీతో కలిసి పోరాడింది. ఆ గ్రూప్‌కు చెందిన ఓ సైనికుడికి చైనా అధినేత జిన్‌పింగ్ లేఖ రాశారని చైనా ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ జిన్హువా తెలిపింది. ఆ లేఖలో అమెరికా, చైనా మధ్య సంబంధాలను ప్రస్తావించిన జిన్‌పింగ్.. ఇరు దేశాల మధ్య లోతైన స్నేహసంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. తమ స్నేహ బంధం కాలపరీక్షకు నిలిచిందన్నారు.
ఈ ఏడాది ఆరంభంలో అమెరికాను యుద్ధకాంక్ష గల దేశంగా అభివర్ణించిన చైనా పత్రిక.. ఆ తర్వాత బైడెన్-జిన్‌పింగ్ భేటీ వేళ ఫ్లయింగ్ టైగర్స్‌ను ప్రశంసిస్తూ కథనాలు గుప్పించింది. గాజాలో అమాయక పౌరుల రక్తపు మరకలు అమెరికాకు అంటుకున్నాయని ఆరోపించిన గ్లోబల్ టైమ్స్ పత్రిక.. బైడెన్‌ను జిన్‌పింగ్ కలిసిన టైంలో మాత్రం ఇరు దేశాల మధ్య సహకారానికి పిలుపునిచ్చింది. చైనా విశ్లేషకులు వైఖరిలో సైతం ఇదే తరహా మార్పు వచ్చింది.













