అష్ట దిగ్భందనం..
తైవాన్ పై అష్టదిగ్భందన మంత్రాన్ని ప్రయోగిస్తోంది చైనా. తైవాన్ ను ఆక్రమించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ ద్వీపం తమ దేశంలోని భాగమేనని వాదిస్తున్న డ్రాగన్.. తాజాగా దీన్ని తమ భూభాగంలో విలీనం చేసుకొనేందుకు ఓ ప్రణాళికను ఆవిష్కరించింది. ఈ బ్లూప్రింట్‌ను విడుదల చేయడానికి ముందు.. తైవాన్ను బెదిరించేందుకు ఆ ద్వీపం దిశగా యుద్ధనౌకలను పంపించింది.
చైనా బ్లూ ప్రింట్ విడుదల
చైనాలో తీర ప్రావిన్స్ ఫుజియాన్, తైవాన్ మధ్య జలసంధుల పరస్పర సహకారాన్ని బలోపేతం చేసే విధంగా డ్రాగన్ ఇటీవల ఓ ప్రణాళికను ఆవిష్కరించింది. తైవాన్ భవిష్యత్తు అభివృద్ధికి బ్లూప్రింట్‌గా చెబుతున్న ఈ ప్లాన్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ విడుదల చేసింది. తైవాన్ సమగ్ర అభివృద్ధికి ఫుజియాన్‌ను ‘ప్రత్యేక జోన్’గా మార్చడంతో పాటు తైవాన్ వాసులు… చైనాలో స్థిరపడేందుకు, ఇక్కడ వ్యాపారాలు చేసేందుకు వీలుగా ఫుజియాన్‌ను ‘ఫస్ట్ హోం’గా పేర్కొంటూ ఈ ప్రణాళికను ఆవిష్కరించినట్లు డ్రాగన్ మీడియా చెబుతోంది.
చైనా యుద్ధ సన్నద్ధత
అయితే, తైవాన్ చుట్టూ యుద్ధ మేఘాలు అలుముకున్న వేళ.. చైనా ఈ బ్లూప్రింట్‌ను తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత వారాంతంలో అమెరికా, కెనడాలకు చెందిన యుద్ధనౌకలు తైవాన్ జలసంధిలో ప్రయాణించి చైనా దుందుడుకు చర్యలను సవాలు చేశాయి. దీంతో ఆగ్రహించిన డ్రాగన్ .. సోమవారం తన యుద్ధనౌకల దండును తైవాన్ జలసంధిలోకి పంపించింది. సైన్యం ఇక్కడ యుద్ధవిమానాలు, జలాంతర్గాముల సన్నద్ధత, ఇతర యుద్ధ విన్యాసాలను చేపడుతుందని చైనా మీడియా వెల్లడించింది.
మరోవైపు వచ్చే ఏడాది జనవరిలో తైవాన్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో చైనా కొత్త బ్లూప్రింట్‌ను ఆవిష్కరించడం గమనార్హం. అయితే, దీనిపై తైవాన్ చట్టప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ఇది ‘హాస్యాస్పదం’ అంటూ డ్రాగన్‌పై మండిపడ్డారు.













