చందమామ ఎందుకంత స్పెషల్?
చంద్రుడు… మిగిలిన ప్లానెట్స్, సబ్ ప్లానెట్స్ తో పోలిస్తే కాస్త దగ్గర ఉన్న సబ్ ప్లానెట్. అంతే కాదు.. ఎన్నో విలువైన ఖనిజాలకు, అద్భుత వనరులకు మూలం. ఈ రహస్యాలను వెలికి తీసేందుకు అగ్రరాజ్యాలు సహా చాలా దేశాలు ప్రయత్నించాయి.. ప్రయత్నిస్తూనే ఉన్నాయి. బాటలోనే ఇండియా కూడా నడుస్తోంది. మరీ ముఖ్యంగా చంద్రుడి మీద నీటి జాడలు ఉన్న నేపథ్యంలో ఇస్రో దక్షిణ ధ్రువాన్ని ఎంచుకున్నది. ఆ ప్రాంతంలో మంచు స్పటికల రూపంలో నీళ్ల నిల్వలు ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన ప్రయోగంలో నాసా కూడా దానిని ధ్రువీకరించింది. నాసా అంచనా ప్రకారం అక్కడ దాదాపు 10 కోట్ల టన్నుల మేర నీటి నిల్వలు ఉండవచ్చు. నీరు ఉన్నచోట మనిషి జీవించగలడు. ఫలితంగా ఇది చంద్రుడి మీద భవిష్యత్తు పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇప్పటివరకూ చంద్రుడిపైకి వెళ్లిన వ్యామనౌకల్లో అత్యధికం అక్కడి మధ్యరేఖాప్రాంతంలో దిగాయి. భారత్ మాత్రం దక్షిణ ధృవానికి సమీపంలోని 70 డిగ్రీల అక్షాంశం వద్ద ప్రాంతాన్ని ఎంచుకుంది. దీనికి చాలా బలమైన కారణాలున్నాయి. అక్కడ ల్యాండింగ్ ద్వారా విశ్వం ఆవిర్భావం వెనక రహస్యాలను తెలుసుకునే అవకాశం కలుగుతుంది. దీంతో చంద్రుడిపై మనుషుల నివాసానికి బాటలు వేసేందుకు ఛాన్స్ ఉంటుంది.
చంద్రుడిపై ఉత్తర ధృవంతో పోలిస్తే దక్షిణ ధృవం లోని భౌతిక పరిస్థితులు ప్రత్యేకం. ఇందులో కొన్ని భాగాలు శాశ్వతంగా చీకట్లో ఉంటాయి. వందలకోట్ల ఏళ్లుగా ఆప్రాంతాన్ని సూర్యకాంతి స్పృశించలేదు. అందువల్ల అక్కడి మూలకాలు సౌర రేడియో ధార్మికత కారణంగా తలెత్తే మార్పులకు లోనుకాకుండా ఉంటాయి. వాటిని శోధిస్తే విశ్వం గురించి అనేక నిగూఢమైన రహస్యాలు తెలిసే అవకాశాలున్నాయి. అక్కడి పురాతన శిలలపై పరిశోధనలు చేయడం ద్వారా విశ్వ ఆవిర్భావం నాటి సౌర కుటుంబచరిత్ర గురించి కొత్త వివరాలు తెలుసుకోవచ్చు.
భూమితో పోలిస్తే చంద్రుడిపై గురుత్వాకరణ శక్తి ఆరో వంతే ఉంటుంది. గాలి కూడా ఉండదు. అందువల్ల భూమితో పోలిస్తే చంద్రమామ నుంచి రాకెట్ ప్రయోగాలు చేయడం చాలా సులువు. అంతే కాదు…అత్యంత తక్కువ ఖర్చుతో ఉంటుంది. ఇక్కడి నుంచి మిగిలిన ప్లానెట్స్ చేసే యాత్రలకు అనువుగా ఉంటుంది. జాబిల్లిపై హీలియం-3 వంటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. వాటి విస్తృతిపై లోతైన సమాచారం సేకరించగలిగితే అక్కడ మైనింగ్ కూడా చేపట్టవచ్చనేమో తెలుస్తుంది. అవసరాన్ని బట్టి వాటిని అక్కడి కాలనీల్లో ఉపయోగించవచ్చు. లేదా భూమిపైకి రప్పించవచ్చు.వీటన్నింటి దృష్ట్యా మూన్.. అన్ని దేశాలకు ఓ కల్పతరువులా కనిపిస్తోంది.













