పొల్యూషన్ “క్యాపిటల్”
దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కాసారంలో చిక్కి విలవిల్లాడుతోంది. మితిమీరిన కాలుష్యంతో గాలి నాణ్యత రోజు రోజుకు క్షీణిస్తోంది. దీనికి తోడు విషపూరిత పొగమంచు కమ్మేయడంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ విషపూరిత పొగమంచు .. శ్వాసకోశ, హృదయ సంబంధిత సమస్యలకు కారణమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వాయునాణ్యత సూచీ 150కి పైగా ఉండడం.. చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ఇది ప్రపంచ ఆరోగ్య
సంస్థ సిఫార్సు చేసిన పరిమితి కంటే 6.3 రెట్లు ఎక్కువ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఢిల్లీలో కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతోంది. దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం సకల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపధ్యంలోనే తాజాగా గ్రాప్- 3ని కూడా అమలులోకి తీసుకువచ్చారు. దేశ రాజధానిలో కాలుష్య స్థాయి ‘తీవ్రమైన’ కేటగిరీకి చేరుకోవడంతో ఢిల్లీ-ఎన్సీఆర్లో పలు నిర్మాణ పనులను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు నిలిపివేశారు. డీజిల్‌తో నడిచే ట్రక్కులను దేశ రాజధానిలోకి ప్రవేశించకుండా నిషేధిస్తూ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (సీఏక్యూఎం) ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ రాజధాని ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఢిల్లీలో పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రధానంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 500 మార్కును అధిగమించడంతో ప్రాథమిక పాఠశాలలను మూసివేశారు. నిర్మాణ పనులపై ఆంక్షలు విధించారు. లైట్ కమర్షియల్ వాహనాలు, డీజిల్ ట్రక్కుల రాకపోకలను నిషేధించారు. భవన నిర్మాణ పనులను, కూల్చివేతలను నిషేధిస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు. దీనిపై ఇప్పటికే అత్యసరం సమావేశాన్ని నిర్వహించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పలు కీలక చర్యల్ని చేపట్టారు.
కాలుష్య నియంత్రణలో గ్రాప్-3 అనేది మూడవ దశలో భాగం. ఇది చలికాలంలో ఢిల్లీ అంతటా అమలు చేసేందుకు కేంద్రం నిర్ణయించిన వాయు కాలుష్య నిర్వహణ
వ్యూహం. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా కాలుష్య స్థాయిలు మరింత పెరిగే అవకాశం ఉందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో గాలి నాణ్యత పరిస్థితిని పరిశీలించడానికి జరిగిన సమావేశంలో .. సీఏక్యూఎం ఏజెన్సీ అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. గ్రాప్ అనేది నాలుగు దశలుగా విభజించిన విధానం. వీటిని ‘పూర్’ (ఏక్యూఐ 201-300), ‘వెరీ పూర్’ (ఏక్యూఐ 301-400), ‘తీవ్రమైన’ (ఏక్యూఐ 401-450), ‘మరింత తీవ్రమైన’ (ఏక్యూఐ >450)వర్గాలుగా పేర్కొన్నారు. గ్రాప్ స్టేజ్-3లో కీలకమైన ప్రభుత్వ ప్రాజెక్టులు, ముఖ్యమైన మైనింగ్, స్టోన్ బ్రేకింగ్ కార్యకలాపాలు మినహా అన్ని నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలను
పూర్తిగా నిలిపివేస్తారు. ఢిల్లీకి బయట రిజిస్టర్ అయిన వాణిజ్య వాహనాలతో పాటు డీజిల్‌తో నడిచే ట్రక్కులు, మధ్యస్థ, భారీ కంటెయినర్ వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించడాన్ని కూడా నిషేధించారు.
వాయుకాలుష్యం మితిమీరిన పరిస్థితుల్లో పలు టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని కోరినట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటి నుండి పని చేయడం, ప్రాంగణంలో ఎయిర్ ప్యూరిఫైయర్లు, ఆన్లైన్లో వైద్య సలహాలు లాంటి అనేక చర్యలను కంపెనీలు చేపట్టినట్టు తెలుస్తోంది. డెలాయిట్, కేపీఎంజీ, పానసోనిక్, బిగ్ బాస్కెట్, బ్లూ స్మార్ట్, Zepto, CIEL HR సర్వీసెస్‌తో సహా డజనుకు పైగా కంపెనీలు ఈ మేరకు ఆదేశించినట్టు సమాచారం. అనారోగ్యంగా ఉన్న ఉద్యోగులు వెల్ బీయింగ్ డే ఆఫ్ ఆఫర్ చేసినట్టు డెలాయిట్ తెలిపింది. రైడ్-షేరింగ్ కంపెనీ బ్లూస్మార్ట్ పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించేలా ఉద్యోగులకు సబ్సిడీ అందిస్తోంది. అలాగే ఉద్యోగులు ఎవరికైనా అనారోగ్యంగా అనిపిస్తే రిమోట్‌గా పని చేయవచ్చని పానసోనిక్ తన సిబ్బందికి తెలిపింది.













