ఇకపై ఇండియా కాదు..! భారత్..!!
కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు చేపడుతోంది. ముఖ్యంగా సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రాజ్యాంగంలో కాలం చెల్లిన బ్రిటిష్ కాలం నాటి అనేక అంశాలకు మోడీ ప్రభుత్వం చెక్ పెట్టింది. వాటి స్థానంలో సరికొత్త నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు కూడా ఐపిసి, సిఆర్పిసి సెక్షన్లలో మార్పులు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటుంది. వీటిపై అనేక విమర్శలు వస్తున్న మోదీ ప్రభుత్వం మాత్రం వెనుకంజ వేయట్లేదు. ఇప్పుడు మరో సంచలన నిర్ణయానికి మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
మన దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మార్చాలని చాలా కాలం నుంచి డిమాండ్ వినిపిస్తోంది. అయితే దీన్ని మార్చేందుకు ఇంతవరకు ఎవరు సాహసించలేదు. కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం భారత్ అనే పేరు మార్చేందుకు సిద్ధమైంది. రాజ్యాంగంలో ఇండియాను యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పిలిచారు. దీన్నే భారత్ అని కూడా సంబోధించారు. ఇప్పుడు ఇండియా అనే పేరు లేకుండా పూర్తిగా యూనియన్ ఆఫ్ భారత్ అని పేరు మార్చేందుకు మోడీ ప్రభుత్వం దాదాపు నిర్ణయం తీసుకుంది. ఈ నెల జరగబోతున్న జి20 సమావేశాల సందర్భంగా అతిధులకు భారత రాష్ట్రపతి విందు ఇవ్వబోతున్నారు. ఈ విందుకోసం అతిధులకు పంపిన ఆహ్వానంలో ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించారు.
రాష్ట్రపతి పంపిన అధికారిక ఆహ్వానంలో ఇది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండడంతో ఇండియా పేరును మార్చేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధమైందని తెలుస్తోంది. ఈనెల 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లో పేరు మార్పుకు సంబంధించి బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందడం ద్వారా చట్ట సవరణ చేయాలని మోడీ సర్కార్ సిద్ధమైంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో పలు ముఖ్యమైన బిల్లులు రాబోతున్నాయని ఇప్పటికి బిజెపి నేతలు చెప్తున్నారు. అందులో భారత్ పేరు మార్పుకు సంబంధించిన బిల్లు కూడా ఉంటుందని ఇప్పుడు తెలుస్తోంది.
ఇండియా పేరును భారత్ గా మార్చడం వెనుక మరో ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విపక్షాలన్నీ ఎన్డీఏ పేరును ఇండియాగా మార్చి బరిలోకి దిగుతున్నాయి. దేశం పేరు కూడా ఇండియా నే కాబట్టి విపక్షాన్ని విమర్శించేందుకు ఆటంకంగా మారింది. అందుకే ఇండియా పేరు మార్చేసి భారత్ గా పిలిస్తే అప్పుడు ఇండియా కూటమిని విమర్శించేందుకు పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. అందుకే పేరు మార్చాలని బిజెపి నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఇండియా పేరును భారత్ గా మార్చడంపై మిశ్రమ స్పందన వస్తోంది.













