పాకిస్తాన్ నోట మాల్దీవులకు సాయం మాట…
మాల్దీవులు కొత్త సర్కార్ చైనా అనుకూల వైఖరి.. ఆదేశాన్ని తీవ్ర ఇబ్బందుల పాల్జేస్తోంది. దశాబ్దాలుగా సాయమందిస్తున్న మిత్రదేశం భారత్‌ను కాదని.. డ్రాగన్ కంట్రీ చైనాకు వంతపాడడం.. మాల్దీవులను చిక్కుల్లో పడేస్తోంది. ముఖ్యంగా ఆర్థికంగా గట్టిదెబ్బే తగిలిందని చెప్పొచ్చు. భారతదేశ పర్యాటకంపై అక్కడి మంత్రులు తీవ్ర ఆరోపణలు చేయడంతో వివాదం మొదలైంది. అది కాస్తా దౌత్యపరమైన సంఘర్షణకు దారితీసింది.
ఇలాంటి పరిస్థితుల్లో భారత్ వ్యతిరేక దేశాలైన చైనా, పాకిస్తాన్.. మాల్దీవులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశాయి. ఇటీవలే చైనాలోపర్యటించిన మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు … భారత్ స్థానంలో తమను ఆదుకోవాలని చైనా పాలకులకు విజ్ఞప్తి చేశారు. ఈపరిణామం భారత్, మాల్దీవుల మధ్య వివాదాన్ని మరింతగా పెంచినట్లైంది. అయితే .. ఇప్పుడు మాల్దీవులకు సాయమందించేందుకు మరో దేశం ముందుకొచ్చింది. అదే పాకిస్తాన్.. తాను అడుక్కునైనా, మాల్దీవులకు సాయం చేస్తానంటోంది పాక్.
ఇటీవల వచ్చిన వరదలు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేశాయి. అయినా పాకిస్తాన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. చెల్లించాల్సిన బకాయిలు భారీగా పెరిగిపోయాయి. కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితులు లేవు. అయినప్పటికీ పాక్ ప్రభుత్వంలో చలనం లేదు. దేశంలో ఉగ్రవాదం జడలు విప్పుకొని నాట్యం చేస్తున్నప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. అనేక విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటే పాకిస్తాన్ ప్రభుత్వం.. ఇప్పుడు మాల్దీవులకు సాయం చేస్తానని ముందుకొచ్చింది. ప్రపంచం ముందు అడుక్కుంటున్న పాకిస్తాన్.. మాల్దీవులకు సాయం చేస్తానని ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
మాల్దీవుల అధ్యక్షుడికి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. అంతేకాదు ఇరుదేశాల అధ్యక్ష, ప్రధాన మంత్రులు పలు విషయాలపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా మాల్దీవుల అభివృద్ధికి తమ వంతు సాయం చేస్తామని పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రకటించారు. ఇక ఈ రెండు దేశాల మధ్య 1966లో దౌత్య సంబంధాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ రెండు దేశాలు కూడా చైనాకు అనుకూలమైనవి అనే ముద్రపడ్డాయి. చైనా కూడా ఈ రెండు దేశాలలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇటీవల చైనా దేశాన్ని రెండు బిలియన్ డాలర్ల రుణం ఇవ్వాలని పాకిస్తాన్ కోరింది. ఇందుకుగాను పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ను విక్రయించాలని ఆ దేశం నిర్ణయించింది. అయితే రెండు బిలియన్ డాలర్ల రుణానికి సంబంధించి ఇంతవరకు చైనా పాకిస్తాన్ దేశానికి ఎటువంటి హామీ ఇవ్వలేదు.. ఇక పాకిస్తాన్ వృద్ధిలో రెండు శాతం కోత విధిస్తూ ఐఎంఎఫ్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో చైనా రుణం ఇస్తుందా అనేది అనుమానంగానే ఉంది.
కేంద్ర బడ్జెట్ లో భారత ప్రభుత్వం.. మాల్దీవులకు కేటాయించే సాయంలో కోత విధించింది. కేవలం మాల్దీవులు మాత్రమే కాకుండా భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ కు కూడా కేటాయించే సాయంలో కోత పెట్టింది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి గాను మాల్దీవులకు కేటాయించే సాయం 600 కోట్లకు కేంద్రం తగ్గించింది. ఇది జరిగిన వెంటనే పాకిస్తాన్ ప్రధాని మాల్దీవుల అధ్యక్షుడు కి ఫోన్ చేయడం విశేషం.. అసలే దివాలా అంచులో ఉన్న పాకిస్తాన్ మాల్దీవులకు ఎలా సహాయం చేస్తుందనేదే ఇక్కడ అసలు ప్రశ్న.













