వారసుడొచ్చేశాడు…
బహుజన్ సమాజ్ పార్టీని ముందుకు నడిపించే సారథి వచ్చేశాడు. బీఎస్పీ అధినేత్రి మాయావతికి రైట్ హ్యాండ్ లా ఉన్న మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ … తనవారసుడు అంటూ బెహన్ జీ ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు బీఎస్పీని బలోపేతం చేసే బాధ్యతను మేనల్లుడికి అప్పగించారు.
ప్రస్తుతానికి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మినహా ఇతర రాష్ట్రాల్లో బహుజన్ సమాజ్ పార్టీ పనితీరును ఆకాశ్ పర్యవేక్షించనున్నారు. ఈ రెండు రాష్ట్రాలపై మాయవతి దృష్టి ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీఎస్పీ ప్రస్తుతం కాస్త బలంగా కనిపిస్తోంది.
ఆకాశ్ ఆనంద్ బీఎస్పీ అధినేత్రి మాయావతి సోదరుడు ఆనంద్ కుమార్ కుమారుడు. 2017లో మాయావతి ఆకాశ్ ను పార్టీ సీనియర్ నాయకులకు.. లండన్‌కు చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్‌గా పరిచయం చేశారు. పార్టీ వ్యవహారాల్లో కూడా పాల్గొంటానని చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆకాశ్ ఆనంద్ బీఎస్పీ అధినేత ఎన్నికల ప్రచార వ్యూహం బాధ్యతలు చేపట్టారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సోషల్ మీడియాను హ్యాండిల్ చేశారు. 2019లో బీఎస్పీ జాతీయ సమన్వయకర్తగా నియమితులైన ఆకాశ్ కు.. 2022లో జరిగే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పేరు దక్కింది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేసే బాధ్యతను కూడా ఆయనకు అప్పగించారు.
ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, తెలంగాణ, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ఆకాశ్ ఆనంద్ ప్రధాన బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఆ పార్టీ రాజస్థాన్ లో రెండు స్థానాలు గెలుచుకోగా, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, తెలంగాణల్లో ఘోర పరాజయం చవిచూసింది. గత ఏడాది నుంచి రాజస్థాన్‌లో పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఆకాశ్ ఆనంద్ కొనసాగుతున్నారు. 28 ఏళ్ల ఆకాశ్ ఆనంద్ అనేక సందర్భాల్లో పార్టీ సీనియర్ నాయకులతో కనిపించారు. ఆయన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ప్రకారం, బాబా సాహెబ్ యువ మద్దతుదారుగా అభివర్ణించుకున్నాడు.













