పోరాటం కొనసాగేనా?
భారత ఒలింపియన్ రెజ్లర్ల పోరాటం నెలల తరబడి కొనసాగుతోంది. దేశప్రతిష్టలను ఖండాంతరాల్లో చాటిన ఒలింపియన్లతో ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరు, క్రీడాకారులకు రైతు సంఘాల మద్ధతు వెరసి ఇది మరింత సుదీర్ఘకాలం సాగే పరిస్థితి కనిపిస్తోంది. రైల్వేలో హెచ్ఓడీగా పనిచేస్తున్న సాక్షిమాలిక్.. తాను విధుల్లో చేరుతున్నట్లు పోస్టు చేసింది. దీంతో రెజ్లర్లు నిరసనల నుంచి వెనక్కు మళ్లారంటూ ప్రచారం జరిగింది. అయితే తాము తమ నిరసనల నుంచి వెనుదిరగలేదని రెజ్లర్లు స్పష్టం చేశారు. అంతే కాదు.. బ్రిజ్ భూషణ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మైనర్.. తన ఫిర్యాదును వెనక్కు తీసుకోలేదన్నారు.
అమిత్ షాతో సమావేశంలో తగిన హామీ రాలేదని రెజ్లర్లు స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని..చట్టం తనపని తాను చేసుకుపోనివ్వాలని అమిత్ షా సూచించారన్నారు. తాము మాత్రం… మైనర్ సహా ఏడుగురు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు దిగిన బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ పై నిష్పాక్షిక విచారణ జరిపి, త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అమిత్్ షా ను కోరినట్లు రెజ్లర్లు తెలిపారు.
చట్టం ముందు అందరూ సమానమేనని అమిత్ షా చెప్పినా… ప్రస్తుతం కనిపిస్తున్న పరిణామాలు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తున్నాయి. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారని ఒలింపియన్లు ఆరోపించినా కూడా బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకే ఢిల్లీ పోలీసులు చాలా సమయం తీసుకున్నారు. ఇక వ్యవస్థలో భాగంగా ఫైట్ చేస్తే ఫలితాలు రావడం లేదని.. రోడ్డుపై పోరాటానికి దిగారు. ఇంత జరుగుతున్నా.. కేంద్రం చిన్నపాటి ప్రకటనలతో సరిపెడుతోంది. అంటే రాజకీయంగా గట్టిపలుకుబడి ఉన్న వ్యక్తి ఎలాంటి చెత్త పని చేసినా.. దానికి చెక్ చెప్పి, శిక్ష విధించే పరిస్థితి ఈదేశంలో లేదంటూ అంతర్జాతీయంగా విషప్రచారం జరిగే పరిస్థితి ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
దేశవ్యాప్తంగా రెజ్లర్ల పోరాటానికి మద్ధతు పెరుగుతోంది. పలువురు విపక్షనేతలు, ప్రఖ్యాత ప్లేయర్స్.. వీరి ఆందోళనకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కేంద్రంలోని బీజేపీ.. తమ ఎంపీ బ్రిజ్ భూషణ్ ను ఎందుకు వెనకేసుకొస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. అంటే క్రీడా ప్రపంచం అంతా వ్యతిరేకిస్తున్నా.. ఎందుకు బ్రిజ్ భూషణ్ పై ఎందుకు ఈగసైతం వాలడం లేదు. అసలు ఎక్కడ లోపముంది అన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది.













